Begin typing your search above and press return to search.

తెలంగాణలో హంగ్ వ‌స్తే.. ఆ పార్టీకి గుడ్ న్యూసే!

అత్యంత రసవత్తరంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2023 6:42 AM GMT
తెలంగాణలో హంగ్  వ‌స్తే.. ఆ పార్టీకి గుడ్  న్యూసే!
X

అత్యంత రసవత్తరంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అత్యంత ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతుండగా.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీఆరెస్స్ ను కొట్టివేయలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం.

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రధానం కాంగ్రెస్ దే పై చేయి అని అంటున్నాయి. అదే స‌మ‌యంలో వార్ వన్ సైడ్ గా జరిగినట్లు చెప్పడం లేదు. అంటే... బీఆరెస్స్ మరీ దారుణమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందనే కామెంట్లు కూడా వినిపించడం లేదు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ కు విజ‌యం ఖాయం అంటునే బీఆరెస్స్ కు మినిమం 40 - 50 స్థానాలు కన్ ఫాం అని అంటున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అత్యధిక సర్వే సంస్థలు ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 60 ని అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆరెస్స్ కానీ సాధించలేవనే సంకేతాలు ఇవ్వడం! దీంతో హంగ్ సర్కార్ అనే చర్చ తెరపైకి వచ్చింది. అలాంటి పరిస్థితే వస్తే 6 - 7 స్థానాలు కన్ ఫాం గా గెలుస్తుంది అని చెబుతున్న ఎంఐఎం కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు వచ్చేస్తే సమస్య లేదు! కానీ... అందుకు ఒకటి రెండు స్థానాలు తగ్గినా కూడా బీఆరెస్స్ కు అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. కారణం... తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ మిత్రులు లేరు! కానీ... బీఆరెస్స్ కు కీలకమైన 6 - 7 స్థానాలు గెలిచే అవకాశం ఉన్న ఎంఐఎం సహాయం చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ - బీజేపీలు కలిసే అవకాశం లేదు! బీజేపీ - ఎంఐఎం ఒకే ప్రభుత్వంలో ఉండే ఛాన్స్ లేదు! ఈ పరిస్థితుల్లో ఇతరులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు... ఈ సమయంలో బీఆరెస్స్ కు కీలకం కాబోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పరిస్థితి మరీ టైట్ గా మారితే... బీజేపీ సపోర్ట్ బీఆరెస్స్ కు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు!

అంటే... అటు ఎంఐఎం, ఇటు బీజేపీలు బీఆరెస్స్ కు సమదూరంలో ఉన్నట్లే భావిస్తున్నారు పలువురు పరిశీలకులు. కారణం... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కంటే బీఆరెస్స్ కు ఆ అవకాశం తమవల్ల వస్తుందంటే బీజేపీ ఒక మెట్టు దిగే అవకాశాన్ని గుర్తుచేస్తున్నారు! దీంతో... కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ వస్తే సరే కానీ... అలా కానిపక్షంలో తెలంగాణలో హంగ్ సర్కార్ అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు.

మరో రెండు రోజులు ఆగితే తప్ప ఈ సస్పెన్స్ కు తెరపడదు! అయితే... అటు ఎంఐఎం కానీ, ఇటు బీజేపీ కానీ బీఆరెస్స్ కు బయట నుంచి మద్దతు ఇస్తాయా.. లేక, కలిసే ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనేది వేచి చూడాలి!