Begin typing your search above and press return to search.

టీఎస్ఆర్టీసీలో ప్రయాణికులకు సీటు బెల్టులు

రానున్న కాలంలో మొత్తం 500 ఏసీ బస్సులు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:57 AM GMT
టీఎస్ఆర్టీసీలో ప్రయాణికులకు సీటు బెల్టులు
X

కార్లలో సీటు బెల్టుతో ప్రయాణం చేయటం తప్పనిసరి. ప్రమాదాల వేళ.. ప్రాణాపాయాన్ని తప్పించుకోవటానికి సాయం చేసే సీటుబెల్టును.. కారులోని ముందు సీట్లో కూర్చున్న వారు ధరిస్తుంటారు కానీ.. వెనుక కూర్చున్న వారిలో తక్కువ మంది మాత్రమే పెట్టుకుంటారు. కార్ల విషయంలోనూ సీటు బెల్టు ధరించే విషయంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. విదేశాల్లో అయితే ప్రజారవాణాలో కీలక భూమిక పోషించే బస్సుల్లో సీటు బెల్టు పెట్టుకునే ప్రయాణిస్తారు. కానీ.. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు.

షాకింగ్ నిజం ఏమంటే.. మన దగ్గర బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు సీటు బెల్టు ధరించేలా ఏర్పాట్లు ఉండాలి. ఆ నిబంధన కూడా ఉన్నప్పటికి ఇప్పటివరకు పట్టించుకున్నది లేదు. తొలిసారి ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు ధరించేందుకువ వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలుత హైదరాబాద్ మహానగరంలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అలా అని అన్ని బస్సులు కాదు. మరో నెలన్నర వ్యవధిలో అందుబాటులోకి రానున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సుల్లో సీటు బెల్టు సౌకర్యాన్ని కల్పించనున్నారు.

సీట్లు బెల్టు ధరించి ప్రయాణించేందుకు వీలుగా ఉండే బస్సుల్ని హైదరాబాద్ ఎయిర్ పోర్టు.. ఐటీ కారిడార్ లో తిరిగేందుకు వీలుగా ఏర్పాటు చేస్తారు.పుష్పక్ పేరుతో నడిచే 40 ఎలక్ట్రిక్ బస్సులు ఎయిర్ పోర్టు రూట్ లో తిరగటం తెలిసిందే. మిగిలిన సర్వీసులకు భిన్నంగా ఎయిర్ పోర్టు బస్సులు లాభాల బాటలో ఉండటం గమనార్హం.

ప్రస్తుతం ఎయిర్ పోర్టు రూట్లో నడిచే బస్సులతో పోలిస్తే.. మరిన్ని ఆధునిక హంగులతో ఈ కొత్త బస్సుల్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతిని అందించనున్నాయి. ఎయిర్ పోర్టు రూట్ తో పాటు.. ఐటీ కారిడార్ లోని మెట్రో సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ తిప్పేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.

రానున్న కాలంలో మొత్తం 500 ఏసీ బస్సులు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. ఇందులో మొదటగా 50బస్సుల్ని ఎయిర్ పోర్టు.. ఐటీ కారిడార్ లోనడుపుతారు. ఎయిర్ పోర్టుకు 20 బస్సులు.. ఐటీ కారిడార్ లో మిగిలిన ముప్ఫై బస్సుల్ని నడపనున్నారు. ఈ బస్సులు ఆకుపచ్చ.. తెలుగు రంగుల్లో ఉంటాయి. కొత్తగా రానున్న ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లు ఉంటాయి. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉండటంతో పాటు మూడు సీసీ కెమేరాలను అమర్చి ఉంటారు. నెల బ్యాకప్ తో రికార్డింగ్ అవుతుంటాయి.

బస్సును రివర్సు చేసేటప్పుడు డ్రైవర్ వెనుక భాగం కనిపించేలా కెమేరా ఉండనుంది. ప్రయాణికులకు సూచనలు చేసేందుకు వీలుగా.. వారు చేరాల్సిన గమ్యస్థానాన్ని తెలిపేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ ఈడీ డిస్ ప్లే బోర్డులు ఉండనున్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 22 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ ఛార్జ్ చేయటానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.