Begin typing your search above and press return to search.

ఈ మందు-ఈ డ‌బ్బు-ఈ డ్ర‌గ్స్‌.. తెలంగాణ ప‌రువు పోలేదా..!

ఇలాంటి రాష్ట్రం ఇప్పుడు డ‌బ్బు, మ‌ద్యం విష‌యాల్లో దేశంలోనే నెంబ‌ర్ 1 స్థానంలో ఉండ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:30 AM GMT
ఈ మందు-ఈ డ‌బ్బు-ఈ డ్ర‌గ్స్‌.. తెలంగాణ ప‌రువు పోలేదా..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు.. ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. ఎక్క‌డిక‌క్క‌డ ఓట ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో.. తాగేందుకు నీరు లేదు. మ‌రికొన్ని జిల్లాల్లో ప‌నులు లేక‌.. వ‌ల‌స‌లు ప‌డుతున్నారు. అంటే.. తినేం దుకు తిండి కూడా అక్క‌డ లేకుండా పోయింద‌నే అర్థం చేసుకోవాలి. ఇలాంటి రాష్ట్రం ఇప్పుడు డ‌బ్బు, మ‌ద్యం విష‌యాల్లో దేశంలోనే నెంబ‌ర్ 1 స్థానంలో ఉండ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం.. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో మూడు చోట్ల ముగిశాయి.(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం). మ‌రో రెండు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో రాజ‌స్థాన్‌, తెలంగాణ ఉన్నాయి. అయితే.. ఈ మొత్తం ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హించిన త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డిన కోట్ల‌కు కోట్ల సొమ్ము, మ‌ద్యం బాటిళ్ల వ్య‌వ‌హారంలో తెలంగాణ ముందుండ‌డం అంద‌రినీ నివ్వెర పోయేలా చేస్తోంది.

ఐదు రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకోగా, తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రూ.225.23 కోట్ల నగదు పట్టిబడింది. తెలంగాణలో రూ.86.82 కోట్లు విలువ చేసే లిక్కర్, రూ. 103.74 కోట్లు విలువ చేసే డ్రగ్స్, రూ. 191.02 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను మభ్య పెట్టేం దుకు ఉపయోగించిన రూ.52.41 కోట్ల విలువైన వస్తువులను ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకుంది.

అయితే.. ఇతర రాష్ట్రాల‌తో పోల్చుకుంటే.. తెలంగాణ‌లోనే మ‌ద్యం, డ‌బ్బు, డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. దీనిని బ‌ట్టి.. తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతోందా? లేక‌.. ప్ర‌లోభాల్లోనూ, యువ‌త‌ను మ‌ద్యానికి, డ్ర‌గ్స్‌కు బానిస‌లుగా మార్చ‌డంలోనూ పోటీ ప‌డుతోందా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఒక‌వైపు.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తాగు, సాగునీటి స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఉపాధి స‌మ‌స్య ఉంది. అదేస‌మ‌యంలో పేద‌రికం తాండ‌విస్తోంది. కానీ, ఎన్నిక‌లు అన‌గానే. ఇంత సొమ్ము బ‌య‌ట‌కు రావ‌డం.. మ‌ద్యంతోపాటు ఈ ద‌ఫా డ్ర‌గ్స్ కూడా ప‌ట్టుబ‌డ‌డం .. దేనికి సంకేతం? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.మ‌రి దీనికి ఎవ‌రు స‌మాధానం చెబుతారో చూడాలి.