Begin typing your search above and press return to search.

ఈ మేజిక్కే..గులాబీ పార్టీని మిగిలిన పార్టీలకు భిన్నంగా నిలిపేది!

రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్నది ఉండరని చెబుతారు. ఆ మాటకు తగ్గట్లే అప్పుడప్పుడు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:26 AM GMT
ఈ మేజిక్కే..గులాబీ పార్టీని మిగిలిన పార్టీలకు భిన్నంగా నిలిపేది!
X

రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్నది ఉండరని చెబుతారు. ఆ మాటకు తగ్గట్లే అప్పుడప్పుడు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామాన్ని నిశితంగా చూసినప్పుడు గులాబీ పార్టీ గడుసుతనం ముచ్చట పడేలా చేస్తుంది. అవసరానికి తగ్గట్లు తమను తాము మార్చుకునే విషయంలో వారికి ఉన్నంత నేర్పు.. ఓర్పు.. తెలంగాణలోని మరే పార్టీకి లేదని మాత్రం చెప్పొచ్చు.

ఇదే.. మిగిలిన పార్టీలకు భిన్నంగా నిలపటమే కాదు.. గులాబీ పార్టీ అంటే ఎంత చికాకు ఉన్న వారు సైతం.. ఇలాంటి చేష్టలకు ఫిదా అయిపోతుంటారు. ఈ తరహా పట్టువిడుపు ధోరణి ఉండాల్సిందేనని చెబుతారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళలో.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో లోక్ సత్తా అధినేత.. నాటి కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణపై దాడి చేయటం.. ఆయన మెడ పై కొట్టటం లాంటి పనులు చేసిన నాటి టీఆర్ఎస్ గురించి తెలిసిందే.

జేపీ లాంటి పెద్ద మనిషికి 'ఆంధ్రోడు' అన్న ముద్ర వేసిన గులాబీనేతలు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమైంది. అయితే.. జేపీ రోటీన్ రాజకీయ నేతల మాదిరి కాకపోవటం.. మేధావి వర్గానికి చెందిన వాడు కావటం.. ఉద్యమ వేడిలో ఈ విషయాన్ని అట్టే ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండిపోయారు. తెలంగాణ సాధన తర్వాత కూడా జేపీ మీద అసెంబ్లీ ఆవరణలో జరిగిన దాడి ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. అదే సమయంలో.. తాము చేసిన పనికి గులాబీ అధినేతతో సహా ఎవరూ చింతించలేదు. విచారం వ్యక్తం చేయలేదు.

మొత్తంగా కాల ప్రవాహంలో ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాము ఒకప్పుడు దాడి చేసి అవమానించిన జేపీ అవసరం గులాబీ పార్టీకి ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు అంశం కీలకంగా మారటం.. ఆయన అరెస్టు విషయంపై గులాబీ పార్టీ స్పందిస్తున్న తీరుపై కినుకుతో ఉన్న సీమాంధ్రకు చెందిన తెలంగాణ ఓటర్లు తమ సత్తాను ఓటుతో చూపిస్తామని బాహాటంగానే చెబుతున్నారు.

తెలంగాణ సాధన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ సీమాంధ్ర మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు గులాబీ పక్షాన నిలవటం తెలిసిందే. తొలిసారి వారి ఆగ్రహాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా గులాబీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా గులాబీ నేతలు పార్టీ తరఫున కాకుండా..వ్యక్తిగత హోదాలో వ్యాఖ్యలు చేయటం.. నిరసనల్లో పాలు పంచుకోవటం లాంటివి చేస్తున్నారు.

అయినప్పటికీ.. గులాబీ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించే విషయంలో వెనుకబడే ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. మెదడుకు పదును పెట్టిన గులాబీ దళం.. తాజాగా జయప్రకాశ్ నారాయణ అలియాస్ జేపీని రంగంలోకి తీసుకొచ్చింది. ఒక ప్రముఖ టీవీ చానల్ లో మంత్రి కేటీఆర్ ను జేపీ ఇంటర్వ్యూ చేయటం.. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉద్యమ వేళ.. తన పట్ల దుందుడుకుగా వ్యవహరించి.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన వారిని సైతం పెద్ద మనసుతో క్షమించేసి.. గతాన్నివదిలేసి.. వర్తమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. అవసరం కావాలే కానీ.. ఎవరినైనా తమ బుట్టలో వేసుకునే చతురత విషయంలో తమకు సాటి వేరెవరూ లేరన్న భావన కలిగించే విషయంలో గులాబీ పార్టీ మరోసారి సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.