Begin typing your search above and press return to search.

ఇదో సిత్రమైన లెక్క.. తెలంగాణలో హంగ్ వస్తే రాష్ట్రపతి పాలనేనా?

ఇలాంటివి కూడా ఉంటాయా? ఇలా కూడా చర్చలు జరుగుతాయా? అన్న భావన కలగటం ఖాయం. అందుకే.. అలాంటి అంశాల్ని సైతం ప్రస్తావించటం అవసరం. అందుకే.. ఈ విశ్లేషణ.

By:  Tupaki Desk   |   26 Nov 2023 5:24 AM GMT
ఇదో సిత్రమైన లెక్క.. తెలంగాణలో హంగ్ వస్తే రాష్ట్రపతి పాలనేనా?
X

ఆలూ లేదు.. చూలు లేదు మొగుడు పేరు సోమలింగం అన్న సామెతకు తగ్గట్లే.. ఈ విశ్లేషణ ఉంటుందన్న భావన కలగొచ్చు. కానీ.. రాజకీయ వర్గాల్ని.. రాజకీయ నేతల్ని దగ్గరగా చూస్తున్న వారికి.. అధికార క్షేత్రానికి అందుబాటులో ఉంటూ.. అక్కడ జరిగే పరిణామాల్ని.. వారి మధ్య జరిగే చర్చల్ని చూసినప్పుడు.. ఇలాంటివి కూడా ఉంటాయా? ఇలా కూడా చర్చలు జరుగుతాయా? అన్న భావన కలగటం ఖాయం. అందుకే.. అలాంటి అంశాల్ని సైతం ప్రస్తావించటం అవసరం. అందుకే.. ఈ విశ్లేషణ.

తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండనుందన్న విషయంపై ఇప్పుడు బోలెడన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు పలు అంచనాల్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వీటిల్లో చాలా వరకు అయితే ఆ ప్రభుత్వం.. లేదంటే ఈ ప్రభుత్వం. కానీ.. కొందరి నోట నుంచి మాత్రం హంగ్ అనే మాట వినిపిస్తోంది. ఇది జరుగుతుందా? అవకాశం ఉందా? లాంటి సందేహాలు రావొచ్చు. కానీ.. తరచిచూస్తే.. దీనికి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. ఇప్పుడున్న పోటీలో అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే వీలుంది.

తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కచ్ఛితంగా గెలుస్తుందన్న అంచనాల్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. కాదు.. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది. కొందరు గులాబీ నేతలు సైతం తమ అంతర్గత సంభాషణల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉందన్న మాటను ఒప్పుకోవటం కనిపిస్తుంది. అయితే.. వీరిలో చాలామంది మర్చిపోతున్న మరో అంశం ఏమంటే.. ఇప్పుడున్న తీవ్రమైన పోటీ వేళ.. హంగ్ కు అవకాశం ఉందా? ఉంటే.. ఎంతమేర ఉందన్న ప్రశ్న వేసుకున్నప్పుడు.. వినిపిస్తున్న వాదన కొంత సిత్రంగా ఉందని చెప్పక తప్పదు.

మొత్తం 119 స్థానాల్లో 7 స్థానాలు మజ్లిస్ (ఈసారి ఒకట్రెండు తగ్గొచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి) అనుకుంటే.. 112 స్థానాలు నిలుస్తాయి. వీటిల్లో బీజేపీ తాజాగా పెంచుకున్న ఓట్ బ్యాంక్ కారణంగా 10-15 సీట్ల మధ్యలో గెలిచే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి ఐదారు రోజుల క్రితం వరకు కూడా బీజేపీ నాలుగైదు స్థానాలు గెలిస్తే గొప్పగా చెప్పే వారు. కానీ.. ఇప్పుడు సీన్ మారిందని.. తెలంగాణ మీద ఆ పార్టీ పెట్టిన ఫోకస్ నేపథ్యంలో ఆశ్చర్యకర ఫలితాలకు అవకాశం ఉందంటున్నారు. అందులో భాగంగా బీజేపీకి 10-15 స్థానాల్ని చూసినప్పుడు సరాసరిన 12 స్థానాల్లో గెలుస్తుందన్న అంచనా వేసుకుంటే మిగిలేది 100 స్థానాలు.

ఈ వందలో రెండు నుంచి నాలుగు మధ్య వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబంధం లేని ఇతర పార్టీలు కానీ స్వతంత్ర అభ్యర్థులు ఖాయంగా గెలిచే వీలుందంటున్నారు. అంటే.. 96 స్థానాలు. వీటిల్లో అధికార బీఆర్ఎస్ 45 స్థానాలకు మించి గెలిచే వీల్లేదన్న వాదనను పరిగణలోకి తీసుకుంటే..మిగిలేది 51 స్థానాలు. అదే జరిగితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 60 స్థానాలకు తొమ్మిది సీట్ల దూరంలో కాంగ్రెస్ అధికారం ఆగుతుంది. ఒకవేళ.. ఇండిపెండెంట్లు ముగ్గురు.. నలుగురు ప్రభుత్వానికి ఓకే చెప్పినా.. అధికారంలోకి రావటం కష్టం.

అదే జరిగితే.. హంగ్ గ్యారెంటీ. అలా జరిగితే.. ప్రభుత్వం ఏర్పాటు కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. మేలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాతే ప్రభుత్వం కొలువు తీరుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కొత్తపొత్తులు తెర మీదకు వస్తాయన్న మాట బలంగావినిపిస్తుంది. అయితే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. లాజిక్కు దగ్గరగా మాత్రం ఈవాదన ఉందని చెప్పకతప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.