Begin typing your search above and press return to search.

తెలంగాణ అధికారాన్ని డిసైడ్ చేసే గ్రేటర్!?

ఈ పోలింగ్ ఫలితాలు ఆదివారం విడుదలవుతున్నప్పటికీ.. పలు అంశాల మీద జోరు చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 5:13 AM GMT
తెలంగాణ అధికారాన్ని డిసైడ్ చేసే గ్రేటర్!?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందడికి విశ్రాంతి కార్డు వేసేశారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బ్రేకులు వేసిన ఈసీ షెడ్యూల్ కు తగ్గట్లే.. అభ్యర్థులు తమ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేశారు. ఎక్కడికక్కడ సర్దుకున్నారు. ఈ నెల 30న ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ ఫలితాలు ఆదివారం విడుదలవుతున్నప్పటికీ.. పలు అంశాల మీద జోరు చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

పోలింగ్ ఒక రోజుకు వచ్చేసిన వేళ.. గెలుపు ఎవరిది? అవకాశాలు ఎవరికి ఉన్నాయి? తాజా పరిస్థితుల మాటేంటి? గ్రేటర్ లో ఎలాంటి పరిస్థితి ఉంది? జిల్లాల్లో లెక్కలు ఏమిటి? లాంటి బోలెడన్ని అంశాలు వరుస పెట్టి చర్చకు వస్తున్నాయి. తెలంగాణలో ఎవరు గెలిచినా.. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక భూమిక పోషిస్తాయన్నది నిజం. ఎందుకుంటే.. 2018లో చూస్తే మొత్తం 23 నియోజకవర్గాల్లో 7 మజ్లిస్.. ఒక బీజేపీ స్థానాన్ని మినహాయిస్తే మిగిలిన పదిహేను స్థానాల్లో అప్పటి టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.

తెలంగాణలోని 119 స్థానాల్లో నాడు గులాబీ పార్టీకి వచ్చిన 88 స్థానాల్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు.. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన సీట్లు దగ్గరదగ్గర 13 శాతం. ఈ లెక్క చాలు.. అధికారాన్ని అందించే విషయంలో గ్రేటర్ ఎంత కీలక భూమిక పోషిస్తుందన్నది అర్థమవుతుంది. అదే.. టీఆర్ఎస్ సాధించిన 15 స్థానాలకు మిత్రుడు మజ్లిస్ కు వచ్చిన 7 స్థానాల్ని కలిపితే.. ఈ షేరు మరింత భారీగా పెరుగుతుంది.

ఇదే లెక్క తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. 2018తో పోలిస్తే.. ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండటంతోపాటు.. బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తోంది. పలు జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోనూ ఆ పార్టీ చూపిస్తున్న ప్రభావం.. ఎవరిని ముంచేస్తుందన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం.. సంకేతాల్ని చూసినప్పుడు తెలంగాణ అధికార పక్షానికి 2018లో గ్రేటర్ లో దక్కిన సీట్లు వచ్చే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తేడా పెరిగే కొద్దీ.. తెలంగాణ అధికారపక్షం ఎవరన్న విషయాన్ని డిసైడ్ అయ్యేలా చేస్తుందని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. గ్రేటర్ లో ఏ పార్టీ అయితే తన బలాన్ని చూపిస్తుందో.. ఆ పార్టీ అధికారానికి దగ్గరగా వెళుతుందని చెప్పాలి. సీఎం ఎవరన్నది డిసైడ్ చేసే విషయంలో గ్రేటర్ కీలక భూమిక పోషిస్తుందని చెప్పక తప్పదు. తాజాగా వినిపిస్తున్న అంచనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.