Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాళ్లకు 'విద్యుత్తు' తీగ.. మెడకూ చుట్టుకుంటుందా?

ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం తదితరాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:30 PM IST
కేసీఆర్ కాళ్లకు విద్యుత్తు తీగ.. మెడకూ చుట్టుకుంటుందా?
X

నీళ్లు, నిధులు, నియామకాలు.. అంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించి.. ప్రత్యేక తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా, కుటుంబపరంగా తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారు. దీనికితోడు పాలనాపరంగానూ ఆయన హయాంలోని నిర్ణయాలను రేవంత్ రెడ్డి సర్కారు తిరగదోడుతోంది. ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం తదితరాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ జారీచేసిన నోటీసుకు ఇప్పటికే కేసీఆర్ ఘాటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే.

విచారణ కమిషన్ ముందుకుసాగుతున్నా కొద్దీ వ్యవహారం ముదురుతోంది. మంగళవారం కమిషన్ ముందు హాజరైన విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తమ వాదనలు వినిపించారు. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఛత్తీస్గడ్ విద్యుత్తు కొనుగోళ్లకు.. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) అనుమతి లేదనేది ప్రధాన అభియోగం. విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు ఇదే విషయాన్ని కమిషన్ ముందు తెలిపారు. పవర్ ప్లాంట్ ల నిర్మాణం జరిగిన తీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కీలక విషయాలను పొందుపరిచారు. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి రూ.వేల కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఒప్పందం చేసుకున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం కాంపిటీటివ్ బిడ్డింగ్ కు వెళ్లలేదని పేర్కొన్నారు.

చత్తీస్ గఢ్ తో ఏటా 1000 మెగావాట్ల సరఫరాకు ఒప్పందం జరిగినా, ఆ రాష్ట్రం ఏ సంవత్సరం ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదని ఆరోపించారు. ప్రత్యామ్నాయంగా మళ్లీ విద్యుత్తు కొనుగోలుతో రూ.వేల కోట్ల నష్టం వచ్చిందని వివరించారు.

భద్రాద్రి ప్లాంట్ తో భారం..

భద్రాద్రి పవర్ ప్లాంట్ ను కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టారని, దీంతో 25 ఏళ్లలో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం పడుతుందనేది కమిషన్ కు రఘు వెల్లడించిన అంశం. వివిధ అంశాల కారణంగా ఏటా రూ.350 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని చెప్పారు.

యాదాద్రిని మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన బీహెచ్‌ఈఎల్‌ తొమ్మిదేళ్లయినా పూర్తి చేయదన్నారు. భద్రాద్రిని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పినా ఏడేళ్లు పట్టిందని అన్నారు. 2013–14లో బీహెచ్‌ఈఎల్‌ కు పోటీ బిడ్డింగ్‌ లో పాల్గొని టెండర్లు దక్కించుకునే సమర్థత 88 శాతం ఉందని, 2015–16 నాటికి అది శూన్యస్థాయికి చేరిందన్నారు. ఎల్‌1 కన్నా 88 శాతం అధికంగా ఛార్జీలు కోట్‌ చేయడమే బీహెచ్‌ఈఎల్‌ పోటీ బిడ్డింగ్‌లలో నెగ్గలేని పరిస్థితికి కారణమని కాగ్‌ పేర్కొందని ప్రస్తావించారు.

బీఆర్ఎస్ సర్కారు ఛత్తీస్‌ గఢ్‌ తో విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం వల్ల అన్నిరకాలుగా రూ.3,385 కోట్ల నష్టం జరిగిందని కె.రఘు అన్నారు. అదే సమయంలో పోటీ బిడ్డింగ్‌కు వెళ్లడం వల్ల కేరళకు యూనిట్‌ కరెంట్‌ రూ.3.60కే వచ్చిందని గుర్తు చేశారు. 1000 మెగావాట్ల కరెంట్‌ తీసుకోవడానికి ఛత్తీస్‌ గఢ్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ మేరకు ఇవ్వలేదని, బహిరంగ విపణిలో కొన్న విద్యుత్‌ వల్ల రూ.2 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడిందన్నారు. మొత్తమ్మీద యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు, ఛత్తీస్ గఢ్ విద్యుత్తు ఒప్పందాలతో రూ.10 వేల కోట్ల నష్టం వాటిలినట్లు పేర్కొన్నారు.

కాగా, పదేళ్ల కాలంలో కేసీఆర్‌ నిర్ణయాలతో విద్యుత్‌ సంస్థలు రూ.81 వేల కోట్ల అప్పులపాలు అయ్యాయని కోదండరాం ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పై క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఛత్తీస్‌ విద్యుత్‌ కు అన్ని ఖర్చులు కలుపుకొని యూనిట్‌కు రూ.7 దాకా అయ్యిందన్నారు. పోటీ బిడ్డింగ్‌ ను అనుసరించి ఉంటే యూనిట్‌ రూ.4.15కే లభించేదని చెప్పారు. విభజన చట్టం కింద పైసా భారం లేకుండా 4 వేల మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించడానికి ఎన్‌టీపీసీ సిద్ధపడగా కేసీఆర్‌ సమ్మతించలేదన్నారు. తొలిదశ 1600 మెగావాట్లకే అంగీకారం తెలిపి, విద్యుత్‌సంస్థలపై భారం పడే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు చెప్పడంతో కేసీఆర్ నిర్లక్ష్యంగా చేసిన పనులు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయన అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

నోటీసులకు స్పందిస్తూ లేఖ రాసిన కేసీఆర్ లేఖలోని అంశాలను వాస్తవాలతో పోల్చి చూసే ప్రయత్నం చేస్తోంది కమిషన్.