Begin typing your search above and press return to search.

నరేంద్ర మోడీపై పోటీ... కేఏ పాల్!

మరోపక్క ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ.. తెలంగాణ నుంచి పోటీచేయబోతున్నారని కథనాలొస్తున్నాయి

By:  Tupaki Desk   |   20 Dec 2023 12:22 PM GMT
నరేంద్ర మోడీపై పోటీ... కేఏ పాల్!
X

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏ పాల్ ఒక వినూత్న నేత! రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ రాజకీయ అంశంపై అయినా తనదైన విశ్లేషణ చేయడంలో ఆయన అందెవేసిన చేయి అని అంటుంటారు! ఇక మరికొందరు ఆయన రాజకీయాలను లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ... కేఏ పాల్ మాత్రం ఏ విషయంలోనూ "తగ్గేదేలే" అన్నట్లుగా దూసుకుపోతుంటారు. ఈ సందర్భంగా తాజాగా నరేంద్ర మోడీపై పోటీ విషయంలో కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు.

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆరెస్ ను గద్దె దింపి రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడ ఇదేవిధంగా సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేసే స్థాయిలో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఅరెస్స్ భావిస్తుందని తెలుస్తుంది.

మరోపక్క ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ.. తెలంగాణ నుంచి పోటీచేయబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఇది సంచలనంగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈసారి ఎన్నికల్లో తెలంగాణ స్థానం నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ సమయంలో స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఢిల్లీలో మాట్లాడిన ఆయన... ప్రధాని నరేంద్ర మోడీ ఈ దఫా ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సత్తా చూపించేందుకు మోడీపై పోటీ చేస్తానని, చిత్తుచిత్తుగా ఓడిస్తామని పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనా స్పందించిన ఆయన.. ఆ గ్యారెంటీలకు తనది గ్యారెంటీ అని అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికాన్ని కోరారు. ఇదే క్రమంలో తాను తప్ప మరెవరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చలేరని పాల్ చెప్పుకొచ్చారు!

కాగా... ఈసారి ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి స్థానాల నుంచి మోడీ లోక్ సభకు పోటీచేసే అవకాశాన్ని బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారని గతకొన్ని రోజులుగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ విషయాన్ని ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేస్తున్న పాల్... మోడీపై తాను పోటీచేసి గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు.