Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కి ఎంపీలు రాకపోతే....!?

చూస్తూండగానే తెలంగాణాలో పదేళ్ల అధికారం బీఆర్ఎస్ కి జారిపోయి నెల రోజులు పై దాటింది

By:  Tupaki Desk   |   5 Jan 2024 2:30 PM GMT
బీఆర్ఎస్ కి ఎంపీలు రాకపోతే....!?
X

చూస్తూండగానే తెలంగాణాలో పదేళ్ల అధికారం బీఆర్ఎస్ కి జారిపోయి నెల రోజులు పై దాటింది. కేసీఆర్ ని మాజీ సీఎం అని పిలవడానికి మీడియా కూడా అలవాటు పడిపోతోంది. ఎక్కడి కేసీఆర్ ఏమా ఉధృతి. ఏమా ఉద్యమ నేత దూకుడు అన్నట్లుగా ఆయన ప్రాభవం ఉండేది. మధ్యాహ్న మార్తాండుడి మాదిరిగా కేసీఆర్ టీడీపీ నుంచి బయటకువచ్చాక రెండున్నర దశాబ్దాల కాలంలో వెలిగిపోయారు.

కేంద్రంలోని పార్టీలను ఉమ్మడి ఏపీలోని పార్టీలను విశేషంగా ప్రభావితం చేసి తాను లేని తెలంగాణా రాజకీయం లేదనిపించారు. 2014, 2018ల్లో అద్భుత విజయాలు అందుకున్న కేసీఆర్ 2023లో హ్యాట్రిక్ విక్టరీ సాధించి సౌత్ ఇండియాలోనే ఆ రికార్డుని సాధించిన తొలి సీఎం గా చరిత్రలో నిలవాలని ఎంతో ఆశించారు.

కానీ జరిగింది వేరుగా ఉంది. కేసీఆర్ రాజకీయ జీవిత చరమాంకంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఓటమి పాలు అయింది. కేంద్రంతో కొట్లాడి సాధించామని చెప్పుకునే తెలంగాణా రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా హవా తగ్గిపోతున్న చాయలు కనిపిస్తున్నాయి.

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన రాజకీయాన్ని మార్చుకోవడం యువకుడు అయిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టడం, తెలంగాణాలో తొలి నెల రోజుల కాంగ్రెస్ పాలన జనాల అభీష్టానికి అనుకూలంగా ఉండడడంతో మంచి మార్కులే పడ్డాయి. ఇక కాంగ్రెస్ కల్చర్ అని అంతా నెగిటివ్ గా చెప్పుకునే వర్గ పోరు కూడా ఏమీ లేదు. సీనియర్లు కూడా మంత్రులుగా ఉన్నా ఎమ్మెల్యేలుగా ఉన్నా కీలక నేతలుగా ఉన్నా తమ పని తాము చేసుకుని పోతున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే కూల్ గా కాంగ్రెస్ ఏలుబడి సాగుతోంది. దాంతో తొందరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా అలాగే కొనసాగే అవకాశాలు నూటికి రెండు వందల శాతం ఉండవచ్చు అని అంటున్నారు. సర్వేలు సైతం ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మొత్తం పదిహేడు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కి పది సీట్లు పైగా వస్తాయని ఒక కచ్చితమైన అంచనా ఉంది. దాంతో అదే నిజం అయితే ఇప్పట్లో కాంగ్రెస్ ని కొట్టే వారే లేరు అన్నది కూడా వాస్తవం.

మరో వైపు చూస్తే ఆరు నూరు అయినా బీఆర్ఎస్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని భావించిన ఆ పార్టీ పెద్దలకు అసెంబ్లీ ఎన్నికలు దిమ్మ దిరిగే ఫలితాలు ఇచ్చారు. 2023 పోతూ పోతూ గులాబీ తోటలో విషాద గీతాన్ని వినిపించింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా లోక్ సభ ఎన్నికలు కూడా దగ్గరలో ఉండడం బీఆర్ఎస్ పార్టీకి కాసింత ఊరట.

అయితే మరో వైపు చూస్తే అదే అసలైన అగ్ని పరీక్ష. ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హానీమూన్ కూడా ముగియకుండా ఆ వేడిలో వచ్చే ఎంపీ ఎన్నికలు కచ్చితంగా హస్తం పార్టీకి ఫేవర్ గానే ఉంటాయని అంటున్నారు. అది బీఆర్ఎస్ కి మింగుడు పడని వ్యవహారమే. కనీసం ఒక ఏడాది కాలం ఆగి ఎంపీ ఎన్నికలు వస్తే కనుక బీఆర్ఎస్ కి ఎంతో కొంత పుంజుకునే పరిస్థితి కనిపించేది.

ఏది ఏమైనా లోక్ సభ ఎన్నికలు దేశమంతా షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న వేళ ఫేస్ చేయాల్సిందే. ఇక తొలి విడతలోనే ఏపీ తెలంగాణాకు ఎన్నికలు అంటున్నారు. దాంతో మార్చి ఏప్రిల్ నెలలలో వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం అయినట్లుగా ఉందా అంటే కేటీయార్ తన భుజ స్కందాల మీదనే ఈసారి గెలుపు బాధ్యతలు వేసుకున్నారు అని అంటున్నారు.

కేసీఆర్ బాత్ రూం లో జారిపడి తుంటి ఎముక గాయంతో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం జరుగుతోంది. దాంతో ఆయన ఎంపీ ఎన్నికల వెళకు అంతగా రెడీగా ఉండరని అంటున్నారు. మరో వైపు చూస్తే కేసీఆర్ ని ఇప్పట్లో జనంలోకి తెచ్చే ప్లాన్ కూడా బీఆర్ఎస్ కి లేదని అంటున్నారు. దాంతో కేసీఆర్ తోనే ఎంపీ ఎన్నికలను మొత్తం నడిపించాలని చూస్తోందని అంటున్నారు.

అందుకే సమీక్షాలలో కేటీయార్ కనిపిస్తున్నారు. ఆయన బొమ్మతోనే ఎంపీ ఎన్నికలకు గులాబీ పార్టీ పోతోంది. అయితే కేసీఆర్ ఊరూ వాడా తిరీగి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తేనే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. దానికి మరో కారణం కుటుంబ పాలన అన్న ఘాటు అయిన విమర్శ. ఇపుడు అదే పార్టీ నుంచి వారసుడిగా కేటీఆర్ జనంలోకి వెళ్తే ఆయన బొమ్మకు ఓట్లు పడతాయా అన్న చర్చ కూడా ఉంది.

బీఆర్ఎస్ మీద వ్యతిరేకత దీని వల్ల ఇంకా అలాగే ఉంటుందా లేక పెరుగుతుందా లేక తగ్గుతుందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కేటీఆర్ ఇపుడు తన చేతిలోకి చక్రం తీసుకున్నారు. మరి ఆయన స్టామినాకు కూడా ఇది పరీక్ష. తప్పకుండా డబుల్ డిజిట్ నంబర్ ని సాధిస్తామని పార్టీ మీటింగులలో ఆయన చెబుతున్నారు. అయితే అది సాధ్యమేనా అన్నది ఒక సందేహం. అదే టైం లొ బీఆర్ఎస్ కి ఎంపీ సీట్లు పెద్దగా రాకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. జవాబు తెలియాలి అంటే మరి కొద్ది నెలలు వేచి చూడాల్సిందే.