Begin typing your search above and press return to search.

బీజేపీ చేసుకున్న పాపం ఏంటి? ఒక్క‌రూ చేర‌ట్లేదే!!

మ‌రి బీజేపీని ఆయా నేత‌లు న‌మ్మ‌డం లేదా? లేక‌.. న‌మ్మ‌కం లేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:37 AM GMT
బీజేపీ చేసుకున్న పాపం ఏంటి?  ఒక్క‌రూ చేర‌ట్లేదే!!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ నాయ‌కుల జంపింగులు తార‌స్థాయికి చేరుతున్నాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. పార్టీల స‌మీక‌ర‌ణ‌లు మారుతున్న నేప‌థ్యంలో చేరిక‌లు కూడా అదే రేంజ్‌లో పుంజుకున్నాయి. అయితే.. ఈ చేరిక‌లు, కూడిక‌లు కేవ‌లం కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. ఎటు చూసినా.. అసంతృప్త నేత‌లు, టికెట్లు ఆశిస్తున్న‌వారు.. ఇక‌, కొన్ని పార్టీల‌కు భ‌విత‌వ్యం లేద‌ని భావిస్తున్న వారు జంపింగులు షురూ చేశారు.

అయితే.. ఈ క్ర‌మంలో అసంతృప్తులు, టికెట్లు ఆశిస్తున్న‌వారు కేవ‌లం అటు అధికార పార్టీ బీఆర్ ఎస్‌, లేదా కాంగ్రెస్ పార్టీల వైపే మొగ్గుచూపుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇరు పార్టీల్లోనే ఇప్పుడు చేరిక‌లు సాగుతున్నాయి. అయితే అటు, లేక‌పోతే ఇటు.. అన్న ట్టుగానే జంపింగులు క‌నిపిస్తున్నాయి. కానీ.. ఎవ‌రూ కూడా ఈ రెండు పార్టీల‌ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేదు. ప్ర‌స్తుతం బీజేపీ ఈ జాబితాలోనే ఉంది. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న‌ప్ప‌టికీ.. బీజేపీలో చేరేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

మ‌రి బీజేపీని ఆయా నేత‌లు న‌మ్మ‌డం లేదా? లేక‌.. న‌మ్మ‌కం లేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వాస్త‌వానికి బండి సంజ‌య్ బీజేపీ చీఫ్‌గా ఉన్న‌ప్పుడు.. అంతో ఇంతో ఊపు క‌నిపించింది. ప‌లు పార్టీల నుంచి నాయ‌కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌ను పార్టీ నుంచి త‌ప్పించారు. కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్‌రెడ్డిని పార్టీ చీఫ్‌ను చేశారు. అనంత‌రం.. పార్టీ చేరిక‌లు మంద‌గించాయి. ఇదిలావుంటే, ఎన్నిక‌ల‌కు ముందు.. కేంద్ర బీజేపీ నాయ‌కులు ఏకంగా.. చేరిక‌ల‌పై పెద్ద ఎత్తున వ్యూహ‌మే సిద్ధం చేశారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ ఈట‌ల రాజేంద‌ర్‌ను చేరికల క‌మిటీ చైర్మ‌న్‌ను చేశారు. దీంతో ఆయ‌న ఒక‌రిద్ద‌రు నాయ‌కు ల వ‌ద్ద‌కు కూడా వెళ్లి చేరిక‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కొత్త‌గా వ‌చ్చి చేరిన వారు లేరు. మ‌రి ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు కూడా బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌లోకి వెళ్లిపోతున్నారే త‌ప్ప‌.. బీజేపీపై చూస్తున్న నాయ‌కులు ఏ ఒక్క‌రూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్న‌వారు.. బీజేపీ ఏం పాపం చేసింద‌నే కామెంట్లు చేస్తున్నారు. పార్టీపై న‌మ్మ‌కం అయినా స‌డ‌లి ఉండాల‌ని.. లేదా పార్టీఅధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని క‌న్ఫ‌ర్మ్ చేసుకునైనా ఉండాల‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు