Begin typing your search above and press return to search.

ఇండియాలో ఎక్కువ సంపాదిస్తున్నది తెలంగాణ ప్రజలే?

ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణకు ఉన్న ప్రత్యేక స్థానమేంటో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదించింది

By:  Tupaki Desk   |   14 Aug 2023 5:30 PM GMT
ఇండియాలో ఎక్కువ సంపాదిస్తున్నది తెలంగాణ ప్రజలే?
X

కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతుందని... ప్రపంచ ప్రఖ్యాత సిటీలతో పోటీపడుతూ విశ్వనగరంగా హైదరబాద్ వెలుగొందుతోందని టి. నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణకు ఉన్న ప్రత్యేక స్థానమేంటో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదించింది.

అవును... దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం, నికర రాష్ట్ర దేశీయోత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగాలు పేర్కొన్నాయి. ఇవి పార్లమెంటుకు అందించిన సమాచారం ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది.

ఆ ఘణాంకాల ప్రకారం... 2022-2023లో 3,08,732 రూపాయలతో తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తితో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత కర్ణాటక 3,01,673 రూపాయలతో పక్కనున్న కర్ణాటక రాష్ట్రం రెండవ స్థానం ఆక్రమించింది. అంటే... గత 6 ఏళ్లలో తెలంగాణ తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి గణనీయంగా పెరిగిందన్నమాట.

ఇందులో భాగంగా... 2017-18లో 1,79,358 రూపాయలుగా ఉండగా.. ఇప్పటి లెక్కల ప్రకారం ఏకంగా 72 శాతం వృద్ధి చెందిందన్నమాట. 2014-15తో పోలిస్తే నికర రాష్ట్ర దేశీయోత్పత్తి పెరుగుదల 151 శాతం ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2014-15లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1.72 లక్షలు ఉండగా... 2022-23లో 3.12 లక్షలకు వృద్ధి చెందింది. అంటే సుమారు 81 శాతం పెరుగుదల నమోదైందన్నమాట. దీంతో... ఇది అసాధారణమైన పెరుగుతుదల అని అంటున్నారు నిపుణులు!

ఈ తాజాగా గణాంకాల ప్రకారం... గుజరాత్, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలను సైతం వెనక్కునెట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నమాట. అయితే దేశానికి తెలంగాణ నుంచి ఈ స్థాయిలో మద్దతు వస్తుంటే... కేంద్రం నుంచి మాత్రం తెలంగాణకు వచ్చే సపోర్ట్ తక్కువని అంటున్నారు.

అవును... దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ స్థాయిలో మద్ధతిస్తున్న తెలంగాణకు, కేంద్రం నుంచి పన్నుల రూపంలో అందుతున్నది చాలా తక్కువేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. గతే ఐదేళ్లలో కీలక ఆదాయ వనరులపై కేంద్రం పన్నులు పెంచకపోవంతో తెలంగాణకు కేటాయింపులు సైతం స్థిరంగానే ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంటోంది.