Begin typing your search above and press return to search.

తెలంగాణ లోక్ సభ బరి.. బీజేపీ అగ్ర నేతలంతా పోటీ.. కాంగ్రెస్ వారంతా దూరం

అందులోనూ కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇచ్చాయి. అటువైపు బీఆర్ఎస్ ఉనికి చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది.

By:  Tupaki Desk   |   27 April 2024 5:30 PM GMT
తెలంగాణ లోక్ సభ బరి.. బీజేపీ అగ్ర నేతలంతా పోటీ.. కాంగ్రెస్ వారంతా దూరం
X

దేశవ్యాప్తంగా కంటే ఈసారి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మహా రసవత్తరంగా ఉన్నాయి. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలో మారడం.. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పవర్ లోకి రావడం.. అసెంబ్లీలో గెలుపు మాదేనన్న బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం.. వెరసి ఈ లోక్ సభ ఎన్నికలు ముక్కోణపు పోటీగా మారాయి. అందులోనూ కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇచ్చాయి. అటువైపు బీఆర్ఎస్ ఉనికి చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది.

15 మంది ఏ చట్ట సభకూ పోటీ చేయనివారే.. నామినేషన్ల దాఖలు అనంతరం చూస్తే.. తెలంగాణ లోక్ సభ బరిలో 28 మంది కొత్తవారు పోటీలో నిలిచారు. ఐదుచోట్ల సిటింగ్, మాజీ ఎంపీలెవరూ పోటీలో లేరు..అసెంబ్లీకి పోటీ చేసిన 13 మంది లోక్ సభకూ లక్ ను పరీక్షించుకుంటున్నారు. మొత్తం 51 మంది అభ్యర్థుల్లో 31 మంది ఏదో ఒక చట్టసభలో పనిచేసిన అనుభవం ఉన్నవారే. వీరిలో 9 మంది సిటింగ్ ఎంపీలు, 8 మంది మాజీ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

5 చోట్ల సిటింగ్, మాజీ ఎంపీలు ఎవరూ లేరు వరంగల్, నల్లగొండ, మల్కాజిగిరి, మెదక్, పెద్దపల్లి.. ఈ ఐదు లోక్ సభ నియోజకవర్గాల్లో సిటింగ్, మాజీ ఎంపీలు ఎవరూ పోటీలో లేరు. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు నెగ్గింది. వీరిలో ఇప్పుడు ముగ్గురు మాత్రమే మళ్లీ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మిగతా ఆరుగురిలో పసుపూరి దయాకర్ (వరంగల్), వెంకటేష్ నేత (పెద్దపల్లి) కాంగ్రెస్ లో చేరినా పోటీకి మాత్రం అవకాశం దక్కలేదు. గడ్డం రంజిత్ రెడ్డి (చేవెళ్ల) కాంగ్రెస్ లో చేరి టికెట్ పొందారు. బీబీ పాటిల్ (జహీరాబాద్) బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్ కు టికెట్ తెచ్చుకున్నారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందారు.

కొసమెరుపు: కాంగ్రెస్ నుంచి అగ్ర నేతలు ఎవరూ ఈసారి లోక్ సభ బరిలో లేరు. గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన రేవంత్ రెడ్డి (మల్కాజిగిరి) సీఎం కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. బీజేపీ నుంచి మాత్రం అగ్ర నాయకులు కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), రఘునందన్ రావు (మెదక్), డీకే అరుణ (మహబూబ్ నగర్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి) ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.