Begin typing your search above and press return to search.

అప్పు మీద లిక్కర్.. కొంపముంచనున్న కొత్త లెక్క?

ఒక అంచనా ప్రకారం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు విలువ చేసే మద్యాన్ని వ్యాపారులు అప్పు మీద తీసుకున్నట్లుగా చెబుతున్నారు

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:17 AM GMT
అప్పు మీద లిక్కర్.. కొంపముంచనున్న కొత్త లెక్క?
X

కొత్త లెక్క బయటకు వచ్చింది. అరువు అన్నది లేకుండా అడ్వాన్స్ పేమెంట్ మీద మాత్రమే సప్లై చేసే మద్యాన్ని.. రోటీన్ కు భిన్నంగా అరువు మీదకు అమ్మిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్నివెలికి తీసిన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతన్న ఎన్నికల సందర్భంగా మద్యాన్ని అప్పు మీద ఇచ్చిన వైనంపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన నివేదికను అధికారుల నుంచి కోరింది. ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో మద్యం డంపుల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు అందాయి. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలు.. 1600 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా.. వీటిల్లో ఎవరికైనా సరే.. డబ్బులు కట్టిన తర్వాతే లిక్కర్ సరుకును డిపోల నుంచి పంపే విధానం అమలులో ఉంది. దీనికి భిన్నంగా ఆగస్టు.. సెప్టెంబరులో మాత్రం అబ్కారీ శాఖ కొత్త విధానానికి తెర తీసింది.

పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని తీసుకొని మద్యాన్ని సరఫరా చేయటంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందాయి. ఆగస్టు.. సెప్టెంబరు రెండు నెలల్లో మాత్రం పోస్టు డేటెడ్ చెక్కులతో మద్యాన్ని సరఫరా చేసి.. ఇప్పుడు మాత్రం రోటీన్ తరహాలో అమ్ముతున్న వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల వేళ అక్రమ డంప్ లను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్ని పరిగణలోకి తీసుకొని వ్యాపారులు పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచినట్లుగా ఈసీకి రాసిన కంప్లైంట్లలో పేర్కొన్నారు.

ఒక అంచనా ప్రకారం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు విలువ చేసే మద్యాన్ని వ్యాపారులు అప్పు మీద తీసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి ఏ ప్రాతిపదికన చేస్తారు? చెల్లింపుల మాటేంటి? పోస్టే డేటెడ్ చెక్కులతో మద్యాన్ని సరఫరా చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ అమలు చేసిందా? ఈసారి మాత్రమే షురూ చేసిందా? అలాంటి పలు ప్రశ్నల్ని సంధించింది. మరి.. దీనికి అబ్కారీ శాఖ ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.