Begin typing your search above and press return to search.

3 నెలల ముందే మద్యం టెండర్లు.. సారు ప్లానే ప్లాన్

షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు మద్యం టెండర్లను పిలిచేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   3 Aug 2023 4:30 AM GMT
3 నెలల ముందే మద్యం టెండర్లు.. సారు ప్లానే ప్లాన్
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు మామూలుగా ఉండదు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చే వేళలో.. కీలక నిర్ణయాలు తీసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపరు. విమర్శల కు జడిచి ఊరుకునే వారెందరో. అందుకు భిన్నంగా ఎన్నికలు నాలుగు నెలల వ్యవధికి వచ్చేసిన వేళ.. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. అంచనాల కు అందని రీతి లో జారీ చేస్తున్న ఆదేశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా.. మద్యం టెండర్లకు సంబంధించి ఇలాంటిదే చోటు చేసుకుంది.

షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు మద్యం టెండర్లను పిలిచేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన కొత్త మద్యం విధానం లో గతం లో మాదిరే 2011 జనాబా ప్రాతిపదికన లైసెన్సు ఫీజుల్ని ఖరారు చేసింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ఈ ఏడాది జనవరి నుంచి 2025 నవంబరు 30 వరకు గడువు ఉండేలా నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది నవంబరులో టెండర్లకు పిలవగా.. ఈసారి మూడు నెలల ముందుకు రావటం చూస్తే కేసీఆర్ తెలివే తెలివి అన్న భావన కలుగక మానదు.

ఈ నెల 4 నుంచి 21 తేదీ వరకు దుకాణదారుల్ని ఎంపిక చేయనుండటంతో లైసెన్సు ఫీజుల్ని ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. గతం లో మాదిరి ఆరు స్లాబులుగా లైసెన్సు ఫీజుల్ని నిర్ణయించారు. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.2 లక్షల చొప్పున డిసైడ్ చేశారు. ఈ మొత్తం తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండని మొత్తం. తెలంగాణ వ్యాప్తంగా 2620 షాపుల కు లాటరీ పద్దతిలో దుకాణదారుల్ని ఎంపిక చేస్తారు. ఒక్క అప్లికేషన్ల నుంచే రూ.1500 - రూ.1800 కోట్ల ఆదాయం సమకూరనుంది.

షెడ్యూల్ ప్రకారమైతే నవంబరు లో నిర్వహించాలి. దాన్ని మూడు నెలలు ముందుకు తీసుకురావటం ద్వారా.. దగ్గర దగ్గర రూ.2వేల కోట్ల భారీ ఆదాయం ప్రభుత్వానికి రానుంది. కీలకమైన ఎన్నికల వేళ.. ఈ మొత్తంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల కు ఖర్చు చేసే వీలుంది. అదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురు గాలి తిరిగి.. కొత్త ప్రభుత్వం కొలువు తీరితే.. వారి చేతికి రావాల్సిన ఆదాయం.. ముందుగానే వచ్చేయటం ద్వారా ఆ ప్రభుత్వానికి చేతులు కట్టేసినట్లుగా మారుతుంది.

ఈ నెల 18 నాటికి కొత్త షాపుల లైసెన్సుల కు తుది గడువు ముగియనుండటంతో రానున్న 15 రోజుల్లో రూ.2వేల కోట్లు (దగ్గర దగ్గర) మొత్తం రానుండటం ప్రభుత్వానికి వరంగా మారనుంది. ఇలా ఎక్కడెక్కడి ఆదాయాల్ని ఇప్పుడే చేతికి వచ్చేలా చేస్తున్న కేసీఆర్ ప్రయత్నాల్ని చూస్తే.. సారు ప్లానింగ్ అంటే ఇలానే ఉంటుందన్న భావన కలుగక మానదు.