Begin typing your search above and press return to search.

గజ్వేల్ మీద ఒట్టు... కామారెడ్డిలో కేసీయార్ కి చేటు...?

ఇపుడు సీన్ కట్ చేస్తే తెలంగాణా సీఎం కేసీయార్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అందులో ఒకటి తన పాత సీటు గజ్వేల్ అయితే రెండవ సీటు కామారెడ్డి.

By:  Tupaki Desk   |   24 Oct 2023 1:30 AM GMT
గజ్వేల్ మీద ఒట్టు... కామారెడ్డిలో కేసీయార్ కి చేటు...?
X

ఒక నాయకుడు రెండు చోట్ల పోటీ చేయడం వర్తమానంలో ఇబ్బందికరంగానే చూడాలి. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఏమన్నా క్షణాలలో జనాలకు చేరిపోతాయి. అదే టైం లో ప్రజలకు ఎప్పటికపుడు అప్టూ డేట్ గా రాజకీయ విశ్లేషణలు చేరిపోతూ ఉంటాయి. దాంతో వారి చైతన్యం ముందు నేతలు ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది.

రెండు చోట్ల ఏ నాయకుడు అయినా గతంలో పోటీ చేస్తే రెండు చోట్లా గెలిచేవారు. దానికి కారణం ఏ సీటుకు ఆ సీటు జనాలు ఆ నేత తమ ఎమ్మెల్యేగానే ఉంటారని భావించడమే. గతంలో ఎన్టీయార్ మూడు చోట్ల పోటీ చేసి గెలిచిన సందర్భం తెలుగు రాష్ట్రాలలో ఉంది.

అయితే కాలం మారింది. రెండు చోట్ల పోటీ చేస్తూ నేతలు ప్రచారంలో చెప్పే మాటలు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇబ్బంది అవడమే కాదు దెబ్బ కూడా పడుతుంది. ఏపీలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేశారు. ఆయన భీమవరం సొంత జిల్లా కాబట్టి అక్కడే సీటు అట్టేబెట్టుకుంటారని గాజువాక వారు భావించారు. ఇక భీమవరంలో టఫ్ ఫైట్ జరిగింది. అలా రెండు సీట్లూ పోయాయి.

ఇపుడు సీన్ కట్ చేస్తే తెలంగాణా సీఎం కేసీయార్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అందులో ఒకటి తన పాత సీటు గజ్వేల్ అయితే రెండవ సీటు కామారెడ్డి. దీంతో కేసీయార్ ఏ సీటు ఉంచుకుంటారు అన్నది చర్చగా ముందుకు వస్తోంది. నిజానికి గెలిచిన తరువాత తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. కానీ విపక్షాలు ఊరుకోవు కదా.అందునా ప్రత్యర్ధి పార్టీలు అయితే దాని మీదనే ఫోకస్ పెడుతూ ఉంటాయి.

అలా కేసీయార్ మీద కామారెడ్డిలో పోటీ చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ అయితే కేసీయార్ గజ్వేల్ సీటుని వదిలిపెట్టరని, కామారెడ్డి ప్రజలు ఆలోచించాలని అంటున్నారు. తాను కామారెడ్డిలో ఉండను గజ్వేల్ లోనే ఉంటానని ఇటీవల బహిరంగ సభలో కేసీయార్ చెప్పారని, మరి ఆయనకు కామారెడ్డి సీటు పోటీ ఎందుకు అని షబ్బీర్ అలీ లాజిక్ పాయింట్ ని లేవనెత్తుతున్నారు.

మరో వైపు చూస్తే కేసీయార్ తాజా టూర్ లో గజ్వేల్ మీద ఒట్టు పెట్టి ఈసారి గెలిపిస్తే నెలకు ఒకసారి పర్యటిస్తాను అని చెప్పారు. దాంతో ఆయన గజ్వేల్ సీటుకే ఫిక్స్ అయినట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నాయి. కామారెడ్డిలో కేసీయార్ మీద కాంగ్రెస్ నుంచి పోటీ పడబోతున్న షబ్బీర్ అలీ అయితే దీని మీదనే మాట్లాడుతున్నారు.

కేసీయార్ కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అంతే కాదు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కామారెడ్డికి వస్తున్న కేసీయార్ కి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన కోరుతున్నారు. తాను కామారెడ్డిలోనే పుట్టానని, అక్కడే చనిపోతానని, తాను కామారెడ్డి లోనే పోటీ చేస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తాను వేరే చోటకు పోటీ మీద వెళ్తున్నట్లుగా బీయారెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, అది తప్పుడు ప్రచారం అని షబ్బీర్ అలీ ఖండించారు.

మొత్తానికి చూస్తే కామారెడ్డిలో జనాలు గెలిపించినా కేసీయార్ ఆ సీటులో ఉండరని షబ్బీర్ ముందే ప్రచారం మొదలెట్టారు. మరి దీనికి బీయారెస్ నేతల జవాబు ఏంటో చూడాలి. ఇక జనాలు కూడా తాము గెలిపించినా రాజీనామా చేసే వారికి ఓటు వేయాలని అనుకోరు అంటున్నారు. మొత్తానికి కేసీయార్ రెండు సీట్ల పోటీ కామారెడ్డిలో చేటు తెస్తుందా అన్నది చూడాలని అంటున్నారు.