Begin typing your search above and press return to search.

ఐటి దాడుల కలకలం

చాలామంది రాజకీయ నేతలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో అడ్డుగోలుగా సంపాదించిన డబ్బులను రియల్ ఎస్టేట్ లో పెట్టడం.

By:  Tupaki Desk   |   2 Nov 2023 6:49 AM GMT
ఐటి దాడుల కలకలం
X

తెలంగాణాలో బుధవారం తెల్లవారుజామున మొదలైన ఐటి సోదాలు కలకలం రేపుతున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో ఐటి అధికారులు మొదలుపెట్టిన దాడులు వివిధ పార్టీల అభ్యర్ధుల్లో టెన్షన్ పెంచేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు, నేతల ఇళ్ళల్లో తెల్లవారిజామునుండే సోదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరుల ఇళ్ళు, ఆపీసులపై దాడులు జరుగుతున్నాయి. చాలామంది నేతలు రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున టికెట్లకు ప్రయత్నాలు చేసుకున్నారు.

చాలామంది రాజకీయ నేతలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో అడ్డుగోలుగా సంపాదించిన డబ్బులను రియల్ ఎస్టేట్ లో పెట్టడం. లేదా రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బును రాజకీయాల్లో కుమ్మరించటం మామూలైపోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయటం, జనాలకు మాయమాటలు చెప్పిఅమ్మేసి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు.

అలావచ్చిన కోట్లాది రూపాయలను మళ్ళీ రాజకీయాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దాంతో ఇటు రియల్ ఎస్టేట్ రంగం అటు రాజకీయాలు రెండూ చాలా ఖరీదైపోయాయి. భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఒకటో రెండో ఎకరాలను అమ్మేస్తే వచ్చే కోట్లాదిరూపాయలను రాజకీయాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇది ఒకపార్టీకి మరో పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. కాకపోతే అధికారంలో పదేళ్ళుగా ఉండటంతో బీఆర్ఎస్ నేతల్లోనే ఎక్కువగా ఈ ధోరణి కనబడుతుంది.

ఈమధ్యనే జరిగిన వినాయక చవితి వేడుకల్లో చివరలో లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. వేలంలో లడ్డూను లక్షల రూపాయలు, కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. అలా లడ్డూలను వేలంలో కొనుక్కున్న వాళ్ళ ఇళ్ళపైన కూడా ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు దాడులు మొదలుపెట్టారు. ఈ దాడులన్నీ బెంగుళూరు నుండి వచ్చిన ఉన్నతాధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. నామినేషన్లు వేసే తేదీ మొదలయ్యే రోజే ఐటి అధికారులు దాడులు చేయటంతో చాలామందిలో కలకలం మొదలైంది. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధుల ఆదాయ వివరాలను పక్కాగా లెక్కలు తేల్చుతామని ఈమధ్యనే ఐటి శాఖ డైరెక్టర్ జనరల్ బహుద్దూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి తాజా దాడుల్లో ఏ విషయాలు బయటపడతాయో చూడాలి.