Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త మంత్రులు వీరే..

తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం పూర్తి మంత్రి వర్గంతో ఈ రోజు (డిసెంబర్ 09) నుంచే కొలువు దీరనుంది

By:  Tupaki Desk   |   9 Dec 2023 6:40 AM GMT
తెలంగాణ కొత్త మంత్రులు వీరే..
X

తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం పూర్తి మంత్రి వర్గంతో ఈ రోజు (డిసెంబర్ 09) నుంచే కొలువు దీరనుంది. దీనికి సంబంధించి గతంలో సూచన ప్రాయంగా కేటాయించిన శాఖలను ఇప్పుడు పూర్తి స్థాయిలో కేటాయించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సమక్షంలో ఈ రోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత శాసనసభ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ పార్టీ నుంచి అక్బరొద్దీన్ ఒవైసీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.


అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది. మజ్లిస్ కు ప్రొటెం స్పీకర్ అవకాశం ఇచ్చినందుకు దూరంగా ఉంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. తెలంగాణ శాసన సభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇప్పటికే ఎన్నుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి గడ్డం గెలుపొందారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, వీటితో పాటు దళితుడిగా ప్రసాద్ కుమార్ కు గుర్తింపు ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా ఆయన పని చేశారు. జౌళి శాఖను ఆయన పర్యవేక్షించారు.

తెలంగాణ మంత్రులు.. కేటాయించిన శాఖల వివరాలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖలను ఉంచుకోనున్నారు. భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ప్లానింగ్, విద్యుత్ శాఖ, ఇందన శాఖలను కేటాయించారు.

దామోదర రాజనర్సింహా - ఆరోగ్యం, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ,

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ,

ఉత్తమ్ కుమార్ రెడ్డి - పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ,

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - సమాచార శాఖ, రెవెన్యూ అండ్ హౌసింగ్,

దుద్దిళ్ల శ్రీధర్ బాబు - ఐటీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ,

పొన్నం ప్రభాకర్ గౌడ్ - రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్,

దనసరి అనసూయ (సీతక్క) - పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ,

కొండా సురేఖ - అటవీ, దేవాదాయ శాఖ,

తుమ్మల నాగేశ్వర రావు - వ్యవసాయ, టెక్స్‌టైల్స్ శాఖ,

జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్, పర్యాటక శాఖలను కేటాయించారు.

వారి వారి అర్హతలను బట్టి శాఖలను కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచే ఆయా శాఖలకు సంబంధించి పూర్తి అధికారాలు అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ముందుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ రోజు సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరవుతున్నారు. కేసీఆర్ అనారోగ్యం భారిన పడడంతో హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆయన వద్ద ఉన్న కేటీఆర్ కూడా సమావేశాలకు హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తోంది.