Begin typing your search above and press return to search.

గర్వం దించాలంటూ గర్వంగా మాట్లాడితే ఎలా పెద్ద సారూ?

తన మాటలతో అదే పనిగా ఆడిపోసుకునే కేసీఆర్.. మాటలు విని విని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కొత్త మాటల్ని వినాలని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 8:19 AM GMT
గర్వం దించాలంటూ గర్వంగా మాట్లాడితే ఎలా పెద్ద సారూ?
X

అవే మాటలు. పదేళ్లుగా చెప్పిందే చెప్పి.. ప్రజలు నో అంటూ చేతిలో ఉన్న అధికారాన్ని తీసేసి.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత కూడా గులాబీ బాస్ కు వాస్తవాలు అర్థం కావట్లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తన మాట తీరు.. తన వ్యవహారశైలి విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇటీవల ఒక టీవీ చానల్ లో నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలోనూ తన గురించి గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది.

తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నా కోరుకోకున్నా.. తమను పాలించే వారు ఒద్దికతో.. అహంకారం అన్నది దగ్గరకు రానివ్వకుండా చూసుకోవాలన్న ఆకాంక్ష తరచూ వ్యక్తమవుతుంటుంది. కానీ.. ఆ విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ కానీ.. చిన్నబాస్ కేటీఆర్ కానీ గుర్తించినట్లుగా కనిపించదు. తన మాటలతో అదే పనిగా ఆడిపోసుకునే కేసీఆర్.. మాటలు విని విని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కొత్త మాటల్ని వినాలని భావిస్తున్నారు.

అయితే.. ఆ విషయాన్ని గమనించిన తండ్రీ కొడుకులు అదే పనిగా రేవంత్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. లేని ఆరోపణలు సంధిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయ్యిందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. తాము పదేళ్లుపవర్ లో ఉన్నప్పటికీ.. తాము ఇచ్చిన హామీల్లో కొన్నింటిని పదేళ్లలో ముట్టుకోలేదన్న కౌంటర్ పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

కేజీ టు పీజీ ఉచిత విద్య మొదలు ఎన్నో హామీల్ని తమ పదేళ్ల పాలనలో ప్రజలు అందించలేదన్న విషయాన్ని గులాబీ బాస్ మర్చిపోవచ్చు కానీ ప్రజలు మర్చిపోరు కదా? ఆ విషయాన్ని వదిలేసి.. పవర్ లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అద్భుతాల్ని క్రియేట్ చేయాలని ఆశించటం అత్యాశే అవుతుంది. పదేళ్ల సుదీర్ఘ కాలంలోనే పూర్తి కాని ఎన్నికల హామీలు.. నాలుగు నెలలు మాత్రమే వయసున్న రేవంత్ సర్కారు చేసేయాలన్న ఆశ అత్యావే అవుతుంది. సర్కారుకు గర్వం పెరిగిందని..దాన్ని తగ్గించాలని ప్రజలకు విన్నవించుకుంటున్నారు కేసీఆర్.

అధికారం చేతిలో లేని వేళలోనూ.. కేసీఆర్ లో అహంకారం తగ్గలేదన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. అందుకే.. తన తీరును మార్చుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది. తెలంగాణ భగ్గుమంటోందని.. బోర్లు ఎండిపోతున్నాయని.. ట్యాంకర్లు వస్తున్నట్లుగా చెబుతున్న కేసీఆర్.. తన పాలనలోనూ ఇవన్నీ ఉన్నాయన్న సత్యాన్ని ఎందుకు మిస్ అవుతున్నారు? గతంలో ఇలాంటి సమస్యలు రాయాలంటే పెద్ద కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న విషయాన్ని జర్నలిస్టులు సైతం ఒప్పుకుంటున్నారు.

అందుకే.. ఈ సమస్యల్ని పెద్దవిగా చూపిస్తున్నరని అంటున్నారు. హరీశ్ విషయానికే వస్తే. ఈ మధ్యన ఆయన సవాలు విసరటం.. రాజీనామా లేఖను గన్ పార్కు వద్ద మేధావులకు ఇచ్చే ఎపిసోడ్ నడిపించారు. నిజానికి రేవంత్ సర్కారు కాకుండా కేసీఆర్ సర్కారు ఉంటే.. ఆ లేఖను పట్టుకొని గన్ పార్కుకు వచ్చే ముచ్చట కూడా ఉండేది కాదు. ఇంటి దగ్గరే హౌస్ అరెస్టు చేసేసి.. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టనిచ్చే వారు కాదు. రేవంత్ సర్కారు అనుసరిస్తున్న ప్రజాస్వామ్య పద్దతుల్ని అవకాశంగా మలుచుకొని విరుచుకుపడుతున్న వేళ.. కేసీఆర్ మాటల్లో అహంకారం.. గర్వమే తప్పించి.. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న సోయి కనిపించట్లేదన్న మాట వినిపిస్తోంది. రేవంత్ సర్కారుపై గర్వం లాంటి ముద్రలు వేసే ముందు.. తనపై ఉన్న ముద్రల గురించి కేసీఆర్ ఫోకస్ పెడితే మంచిదంటున్నారు.