Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి!

ఇందులో భాగంగానే కౌలురైతుల సమస్యల పరిష్కారంపై శనివారం సచివాలయంలో ధరణి కమిటి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది

By:  Tupaki Desk   |   29 Jan 2024 11:30 AM GMT
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి!
X

ఇపుడీ అంశమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైందట. కౌలు రైతులను గుర్తిస్తామని, వారికి అన్నీవిధాల సాయంగా ఉంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పదేపదే హామీలిచ్చింది. అదే సమయంలో కౌలురైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చాలాచోట్ల ప్రస్తావించింది. ఒకవైపు కౌలురైతులను కేసీయార్ ప్రభుత్వం అసలు గుర్తించటానికి కూడా ఇష్టపడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కౌలురైతులను బాగా ఆకర్షించింది. ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత కాంగ్రెస్ అనేక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టింది.

ఇందులో భాగంగానే కౌలురైతుల సమస్యల పరిష్కారంపై శనివారం సచివాలయంలో ధరణి కమిటి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. కౌలురైతులను ఆదుకోవటం కోసం వారికి కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపచేయటం కష్టంకాదని అయితే వారిని గుర్తించటమే అసలు సమస్యగా కమిటికి అర్ధమైంది. శనివారం మీటింగులో అటవీ, వ్యవసాయ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో అమలైన రైతుబంధు పథకం అమలులో వ్యవసాయ శాఖ, గిరిజన, అటవీ శాఖల ప్రమేయం లేదన్న విషయం బయటపడింది.

రైతుబంధు పథకం అమలులో పై శాఖల ప్రమేయం ఉండుంటే మొత్తం రైతుల సంఖ్యలో అర్హులైన రైతులు ఎవరు ? అన్న విషయం తెలిసుండేది. అసలు ఏ ప్రాతిపాదికన కేసీయార్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేసిందో కూడా అర్ధంకాలేదని తాజా సమావేశం అభిప్రాయపడింది. అటవీ భూములు, రెవిన్యు భూముల లెక్కల మధ్య చాలా తేడా కనబడుతోందని సమావేశం గుర్తించింది. అలాగే ధరణి డేటాలో ఉన్న భూముల లెక్కలకు, వాస్తవంగా ఉన్న భూముల రికార్డుల లెక్కలకు మధ్య లక్షల ఎకరాల తేడా ఉన్నట్లు తెలిసి కమిటి విస్తుపోయింది.

ఈ నేపధ్యంలోనే ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ఏపీ క్రాప్ కల్టివేషన్ యాక్ట్ విధానం మంచిదని కాబట్టి ఆ చట్టాన్ని అధ్యయనం చేయాలని కూడా కమిటి నిర్ణయించింది. కమిటి తాజా సమావేశం బట్టి వ్యవసాయ భూముల లెక్కల్లో, అర్హులైన రైతల లెక్కలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు బయటపడింది. అందుకనే కౌలురైతులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించటంలో చాలా సమస్యలున్నట్లు అర్ధమవుతోంది. మరి కమిటి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుందో చూడాలి.