Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నిక‌లు.. చిన్న పార్టీల‌తోనే అస‌లు తంటా!

ఇక‌, ఆన్ లైన్ స‌ర్వేలు, ఆఫ్‌లైన్ స‌ర్వేలు మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయ‌ని, ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Oct 2023 12:30 PM GMT
తెలంగాణ ఎన్నిక‌లు.. చిన్న పార్టీల‌తోనే అస‌లు తంటా!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎన్నిక‌ల డేట్ కూడా ప్ర‌క‌టించింది. నవంబ‌రు 30న ఒకే ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. కీల‌క‌మైన బీజేపీ, బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌ధానంగా పావులు క‌దుపుతున్నాయి. అధికారంపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తోంది. డిసెంబ‌రు 3వ తేదీన ప్ర‌క‌టించే ఫ‌లితాల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని ఈ మూడు పార్టీలు ప్ర‌క‌టిస్తున్నాయి.

ఇక‌, ఆన్ లైన్ స‌ర్వేలు, ఆఫ్‌లైన్ స‌ర్వేలు మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయ‌ని, ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే, చిన్నా చిత‌కా పార్టీల దూకుడు ఇప్పుడు పెద్ద పార్టీల‌కు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా క‌మ్యూనిస్టు పార్టీలు స‌హా టీడీపీ వంటి పార్టీల‌ ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ వంటి ఉమ్మ‌డి జిల్లాల్లో ఓటు బ్యాంకు చీలిపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని ఒక అంచ‌నా ఉంది.

నిజానికి ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ముందు వ‌ర‌కు కూడా బీఆర్ ఎస్‌తోపొత్తు కోసం క‌మ్యూనిస్టులు ఎదురు చూశారు. కానీ, ఆ పార్టీ నుంచి స‌రైన స్పంద‌న రాలేదు. ఇక‌, టీడీపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మైంది. అయితే, ప్ర‌స్తుతం పార్టీ అధినేత చంద్ర‌బాబు జైల్లో ఉండ‌డంతో తెలంగాణ ఎన్నిక‌ల‌పై పూర్తిస్థాయిలో ఫోక‌స్ చేస్తారా? లేక .. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అవుతారా? అనేదిచూడాల్సి ఉంది. ఇక‌, ఎంఐఎం 15 నుంచి 20 స్థానాల్లోనూ.. ఆమ్ ఆద్మీ పార్టీ 40 నుంచి 50 చోట్లా పోటీకి రెడీ అవుతున్నాయి.

అదేస‌మ‌యంలో ఎంఆర్ పీఎస్ ఈ సారి ఎస్సీలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టింది. ఇక్క‌డ త‌మ‌కు అనుకూలంగా ఉండే పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో ఈ చిన్నా చిత‌కా పార్టీలు ఓట్లు చీల్చ‌డం ప్రారంభిస్తే.. అది పెద్ద పార్టీలైన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించే ప‌రిణామంగా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుపై ఆశ‌లు పెట్టుకున్న బీజేపీ కూడా.. చిన్న పార్టీల దూకుడుతో ఆ ఓటు త‌మ‌కు ద‌క్కుతుందా? లేదా? అనే మీమాంస‌లో ప‌డింది. మొత్తంగా పైకి చిన్న పార్టీలే అయినా.. ఎన్నిక‌ల సంగ్రామంలో ఇవే పెద్ద‌పార్టీల‌కు భారంగా మార‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.