Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్ లో ముదురుతున్న ముసలం

మీడియా మేనేజ్ మెంట్ తో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నెట్టుకు వస్తున్నా అది ఎన్ని రోజులు అన్నదానికి ఎవరి వద్దా సమాధానం లేదు.

By:  Tupaki Desk   |   14 April 2024 4:40 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ లో ముదురుతున్న ముసలం
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్నది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బయటకు బలంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల తర్వాత ఈ కలహాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న అనుమానం పార్టీ వర్గాలలో కలకలం రేపుతున్నది. ఆరేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం పార్టీలోని సీనియర్లకు జీర్ణం కావడం లేదు. దీంతో ప్రభుత్వంలో సమన్వయం కొరవడి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు పరిస్థితి ఉన్నది.

మీడియా మేనేజ్ మెంట్ తో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నెట్టుకు వస్తున్నా అది ఎన్ని రోజులు అన్నదానికి ఎవరి వద్దా సమాధానం లేదు. పార్టీలో సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం లోక్ సభ స్థానానికి తన భార్య ఇందిరకు, అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తన కుమారుడు యుగంధర్ కు టికెట్ ఆశించారు. మరో సీనియర్ నేత వీహెచ్ కూడా ఇదే టికెట్ ఆశించాడు. అయితే వీరెవ్వరికీ టికెట్ వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. రేవంత్ మీద మొదట ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్ తనను కలిసిన తర్వాత తనకు టికెట్ రాకుండా భట్టి అడ్డుకుంటున్నాడని ఆరోపించడం గమనార్హం.

ఇక నల్లగొండ, భువనగిరి లోక్ సభ టికెట్లను కోమటిరెడ్డి సోదరుల కుటుంబం ఆశించింది. భువనగిరి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, నల్లగొండ టికెట్ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిలకు కేటాయించడంతో కోమటిరెడ్డి సోదరులు గుర్రుగా ఉన్నారు. ఇక రేవంత్ కు మద్దతుగా నిరంతరం పనిచేసిన అద్దంకి దయాకర్ కు శాసనసభ, లోక్ సభ స్థానాలలో మొండిచేయి చూయించారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ కుమారుడికి కేటాయించడం పట్ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహంగా ఉన్నారు. ఇక మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించక పోవడంతో ఆ వర్గాలు, నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన దానంకు సికింద్రబాద్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి చేవెళ్ల, జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజ్ గిరి టికెట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ను నమ్ముకుని పనిచేస్తున్న నేతలకు మింగుడు పడడం లేదు. ఈ మూడు స్థానాలలో కాంగ్రెస్ గెలుపును ఆశించడం అత్యాశగానే భావించవచ్చు. రేవంత్ సొంత జిల్లా పాలమూరులో మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డికి, నాగర్ కర్నూలు ఎస్సీ స్థానాన్ని మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి కేటాయించడం జరిగింది. ఇక్కడ అనూహ్యంగా గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలు ఎంత వరకు ఓట్లు రాబడతారు అన్నది ప్రశ్నార్ధకమే.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 10 లక్షల 45 వేల 478. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 11 లక్షల 43 వేల 397. కేవలం 97,919 ఓట్లు అధికంగా సాధించిన కాంగ్రెస్ 12 స్థానాలు కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ పార్టీ గద్వాల, అలంపూర్ స్థానాలతో సరిపెట్టుకున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలలో శాసనసభ ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ ఓట్లు రాబట్టుకోగలదా అన్నది కూడా ప్రశ్నార్ధకమే.

ఇటీవల కొడంగల్ పర్యటనలో తన నియోజకవర్గంలో మెజారిటీ రాకుండా చేసి తన మీద కుట్రలు చేస్తున్నారని రేవంత్ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. ఆడలేక పాత గజ్జెలు అన్నట్లు రేవంత్ ముందే ఈ వాదనను బయటకు తెస్తున్నాడని, లోక్ సభ ఎన్నికలలో తేడా వస్తే తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు అని భావించే ఇలా చెబుతున్నాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ అంతర్గత కలహాలు లోక్ సభ ఎన్నికల తర్వాత ముదిరి పాకాన పడడం ఖాయం అని మీడియా, రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.