Begin typing your search above and press return to search.

తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో పొత్తులు షురూ...!

తెలంగాణా నుంచి ఏపీకి రూట్ వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 4:05 AM GMT
తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో పొత్తులు షురూ...!
X

తెలంగాణా నుంచి ఏపీకి రూట్ వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉమ్మడి ఏపీ రెండుగా చీలినా ఓటర్ల సెంటిమెంట్లు మనోభావాలూ దాదాపుగా ఒకేలా ఉంటాయి కాబట్టి ఒక్క చోట గెలిస్తే రెండవ చోట ఈజీగా విస్తరించవచ్చు అన్నది కాంగ్రెస్ ప్లాన్. నిజానికి జాతీయ పార్టీలకు ఈ అవకాశం ఎపుడూ ఉంటుంది.

ఈ మాస్టర్ ప్లాన్ బీజేపీదే. తెలంగాణాలో సత్తా చాటుకుంటే ఏపీలో టీడీపీతో పొత్తులకు వెళ్ళి అధికారంలో వాటా దాకా కధ నడపాలని వ్యూహరచన చేసినట్లుగా వార్తలు అయితే వచ్చాయి. కానీ బీజేపీ గ్రాఫ్ ఇపుడు బాగా తగ్గిపోతోంది. అక్కడే సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని అనుకుంటున్న నేపధ్యం ఉంది.

దాంతో ఏపీలో ఎలా అన్నది ఒక పెద్ద ప్రశ్నగానే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ అలా కాదు ఫుల్ జోష్ మీద ఉంది. హుషార్ మీద ఉంది. అసలు కాంగ్రెస్ కి తెర వెనక నుంచి మద్దతు టీడీపీ ఇస్తోంది అని ప్రచారమూ ఉంది. దాన్ని తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ స్టార్ట్ చేస్తే బీయారెస్ కూడా మెల్లిగా అందుకుంటోంది.

బాబు పార్టీ తెలంగాణాలో అస్త్ర సన్యాసానికి కారణం కాంగ్రెస్ గెలుపు కోసమే అని అంటున్నారు. కాంగ్రెస్ తెలంగాణాలో గెలిస్తే రేపటి రోజున జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ మరింతగా పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని టీడీపీ పెద్దలు భావిస్తున్నారని టాక్.

ఇప్పటికే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ మిజోరాం లలో కాంగ్రెస్ కి అనుకూలత ఉంది. తెలంగాణా కూడా జత కలిస్తే అయిదింట నాలుగు స్టేట్స్ ఆ పార్టీ ఖాతాలో పడతాయి. అలా ఇండియా కూటమి సెమీ ఫైనల్స్ లో విజేతగా మారి లోక్ సభ ఎన్నికల నాటికి బాగా దూసుకుపోతుందని అంచనా కడుతున్న వారూ టీడీపీలో ఉన్నారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ కూడా ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. తెలంగాణాలో పోటీ చేయకపోవడం అన్నది చాణక్య రాజకీయంలో భాగం అని అంటున్నారు. అలా చేయడం వల్ల కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో ఆ పార్టీతో బాహాటంగానే పొత్తుకు టీడీపీ రెడీ అవుతుందని అంటున్నారు.

2024 ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి అండగా ఉంటుంది అన్న ప్రచారంతో టీడీపీ ముందుకు వెళ్తుందని కూడా అంటున్నారు. అంటే ఇది అచ్చం 2014 లో చేసిన ప్రచారం మాదిరిగా అన్న మాట. నాడు మోడీ బాబు జోడీ అంటూ ప్రచారం చేశారు. విభజిత ఏపీకి కేంద్రం అండ దండ కావాలని స్లొగన్స్ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

ఇపుడు కూడా ఏపీ అన్ని విధాలుగా అప్పుల పాలు అయిందని, ఏపీని బాగు చేయాలంటే కలసి వచ్చే కాంగ్రెస్ లాంటి పార్టీలే కేంద్రంలో అధికారంలో ఉండడం అవసరం అని టీడీపీ చెప్పి మరీ జనాల మనసు చూరగొంటుందని ఈ కూటమికి అదే ఆక్సిజన్ అవుతుందనీ అంటున్నారు. మొత్తానికి టీడీపీ ఏపీలో మహా కూటమి దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. అందులో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషిస్తున్నారు.