Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో తీర్మానాలు చెల్లవా? ఉత్తమ్, మైనంపల్లికి మినహాయింపులు అందుకేనా?

ఒకప్పుడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కాంగ్రెస్ బీజేపీ దెబ్బకు కకావికలమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Oct 2023 6:56 PM GMT
కాంగ్రెస్ లో తీర్మానాలు చెల్లవా? ఉత్తమ్, మైనంపల్లికి మినహాయింపులు అందుకేనా?
X

ఒకప్పుడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కాంగ్రెస్ బీజేపీ దెబ్బకు కకావికలమైన సంగతి తెలిసిందే. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. కానీ ఇప్పుడు తిరిగి పుంజుకునే దశలో ఉన్న ఆ పార్టీ ఎన్నికలపై ప్రత్యేక ద్రుష్టి సారించింది. కర్ణాటకలో విజయంతో జోరుమీదున్న హస్తం పార్టీ.. తెలంగాణలో నూ ఊపు కొనసాగించాలని చూస్తోంది. అదే పట్టుదలతో సానుకూల పవనాలను అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో సాగుతోంది. ఈ క్రమంలోనే 55 మందితో తొలి జాబితా ప్రకటించింది. అయితే ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హన్మంత రావు కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో 2018 ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి పోటీ చేశారు. హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్.. అనంతరం లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ కోదాడ నుంచి బరిలో దిగిన పద్మావతి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ ఇద్దరికీ సీట్లు ఇవ్వాలని ఉత్తమ్ పట్టుబట్టారు. అధిష్ఠానం నిర్ణయం తీసుకోకముందే ఈ ఎన్నికల్లో తాను, భార్య పోటీ చేస్తామని ఉత్తమ్ ప్రకటించుకున్నారు. అంతే కాకుండా అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ నిర్వహించిన సమావేశాల్లోనూ రెండు టికెట్ల కోసం ఉత్తమ్ పట్టుబట్టడంతో గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

మరోవైపు తన తనయుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ డిమాండ్ చేస్తూ మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుక్కి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు హామీ ఇవ్వడంతోనే హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఉత్తమ్, మైనంపల్లి కుటుంబాల్లో ఇద్దరికి టికెట్లు కేటాయించింది కాంగ్రెస్. అయితే ఉదయ్ పూర్ తీర్మానం ప్రకారం కుటుంబాలకు ఒకటే టికెట్ అని కాంగ్రెస్ చెబుతూ వస్తోంది. కానీ ఉత్తమ్, మైనంపల్లి విషయంలో మాత్రం ఈ తీర్మానాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఉత్తమ్ దంపతులు, మైనంపల్లి తండ్రీ కొడుకులు గెలిచే అవకాశాలు ఉన్నాయని అధిష్ఠానం నమ్మడమే అందుకు కారణమని అంటున్నారు.