Begin typing your search above and press return to search.

మైనంప‌ల్లి లాగే... మా కుటుంబాల‌కు రెండు టికెట్లు ఇవ్వాల్సిందే

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం ఆ పార్టీలో అగ్గి రాజేసినట్లే క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Oct 2023 2:30 AM GMT
మైనంప‌ల్లి లాగే... మా కుటుంబాల‌కు రెండు టికెట్లు ఇవ్వాల్సిందే
X

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం ఆ పార్టీలో అగ్గి రాజేసినట్లే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న రాక‌ను నిర‌సిస్తూ ఇటు మ‌ల్కాజ్‌గిరి డీసీసీ అధ్య‌క్షుడు అటు మెద‌క్ జిల్లా అధ్య‌క్షుడు త‌మ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ర‌చ్చ కొన‌సాగుతుండ‌గానే మైనంప‌ల్లి త‌న‌కు, త‌న కుమారుడికి హామీ పొంద‌డంతో...

`ఒకే కుటుంబానికి రెండు టికెట్లు` పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్‌లో అగ్గి రాజేస్తోంది. నిన్న మొన్న వ‌చ్చిన మైనంప‌ల్లికి ద‌క్కిన హామీ, అవ‌కాశం త‌మ‌కు ఎందుకు లేద‌ని ప‌లువురు సీనియ‌ర్లు చ‌ర్చిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

రాజ‌స్తాన్‌లో ఉదయ్‌పూర్ జ‌రిగిన స‌మావేశంలో ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్‌` అంటూ కాంగ్రెస్‌ డిక్లరేషన్ చేసింది. అయితే, ఇటీవ‌ల వ‌ర‌కు దీన్ని సాకుగా చూపుతూ పలువురు నేతల కుటుంబాలకు రెండేసి టికెట్లపై హామీ ఇవ్వ‌లేదు. కానీ మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు విష‌యంలో సీన్ మారిపోయింది. ఆయనకు, కుమారుడు రోహిత్‌కు టికెట్లు ఇస్తామన్న హామీతోనే కాంగ్రెస్‌ ఆయనను పార్టీలో చేర్చుకుంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలు ఇప్పుడు అధిష్ఠానంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. కొత్తగా వచ్చిన వ్యక్తికే రెండేసి టికెట్లు ఇస్తే, పార్టీనే నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవ‌లే చేరిన నేత‌కు రెండు టికెట్లు ఇచ్చి... కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు నో చెప్తే స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌క త‌ప్ప‌వ‌ని గ‌మ‌నించిన కాంగ్రెస్‌ పెద్దలు మరికొందరు నేతలకు కూడా రెండు టికెట్లు ప్ర‌తిపాద‌న ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇలా ఆశిస్తున్న వారిలో పీసీసీ మాజీ ఛీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఉన్నారు. ఉత్త‌మ్ హుజూర్‌నగర్‌, ఆయ‌న స‌తీమ‌ణ కోదాడ టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత జానారెడ్డికి నాగార్జునసాగర్‌, ఆయన పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డికి మిర్యాలగూడ ఆశిస్తున్నారు. మ‌రో సీనియ‌ర్ నేత‌ కొండా సురేఖ త‌న‌కు వరంగల్‌ తూర్పు, త‌న‌ భర్త కొండా మురళికి పరకాల టికెట్లపై ప‌ట్టు ప‌డుతున్న‌ట్లు సమాచారం.

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ సైతం త‌మతో పాటుగా త‌మ‌ కుటుంబ స‌భ్యుల‌కు టికెట్టు ఇవ్వాల‌ని కోరుతున్నట్టు స‌మాచారం. మొత్తంగా మైనంపల్లి వ‌ల్ల త‌మ‌ను కూడా ఆ జాబితాలో చేర్చాలని మరికొందరు నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తుండ‌టంతో కాంగ్రెస్‌లో మరోమారు వేడి రాజుకుంది.