Begin typing your search above and press return to search.

రెబల్స్ రెడీ అవుతున్నారా ?

తెలంగాణాకు తొందరలో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ రెడీ అవుతున్నారా ?

By:  Tupaki Desk   |   1 Oct 2023 7:00 PM IST
రెబల్స్ రెడీ అవుతున్నారా ?
X

తెలంగాణాకు తొందరలో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ రెడీ అవుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం, ఢిల్లీ వర్గాలను బట్టి అవుననే అనుకోవాలి. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై అధిష్టానం మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం కాకపోయినా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు సీట్లను బీసీలకు కేటాయించాలని అనుకున్నది.

ఇదే విషయాన్ని తమను కలిసిన బీసీ నేతలకు గతంలో ఏఐసీసీ అగ్రనేతలు చెప్పారు. దాంతో ఎంతో కొన్ని సీట్లు దక్కుతున్నాయి కదాని బీసీ నేతలు హ్యాపీగానే ఫీలయ్యారు. అయితే ఈమధ్య పార్టీలో పరిణామాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల నుండి వస్తున్న రెడ్డి, వెలమ నేతలకు సీట్లు ఖాయంచేస్తున్నారు. దాంతో తాము పోటీచేసే నియోజకవర్గాలపైనే ప్రభావం పడుతుందని బీసీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే విషయమై స్పష్టమైన హామీ కోసం బీసీ నేతలు ఢిల్లీకి వెళ్ళారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయినపుడు వీలున్నంతలో 34 సీట్లను బీసీలకు కేటాయించాలని అధిష్టానం డిసైడ్ అయిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే కేసీ గుర్తు చేస్తున్నట్లుగా పార్టీలో పరిస్థితులు లేవని నేతలు ఆందోళన పడుతున్నారు. తాము అడిగినన్ని సీట్లు కాకపోయినా కనీసం 34 సీట్లయినా కేటాయించకపోతే తిరుగుబాటు చేయాల్సిందే అని బీసీ నేతల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది.

అవసరమైతే బీసీ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్లు వేయాలనే చర్చ పెరిగిపోతోంది. సర్వేల పేరుతో, ప్యారాచూట్ నేతలకు టికెట్లిచ్చి చివరకు పార్టీనే నమ్ముకుని ఉన్న తమకు అన్యాయం చేయద్దని బీసీ నేతలు పార్టీ అగ్రనేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఎవరితో ఎంతమాట్లాడినా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాలు లేవని కూడా బీసీ నేతలు అంటున్నారు. ఈ పరిస్ధితుల్లోనే అభ్యర్ధులను ఫైనల్ చేసే విషయంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటి ఒకటికి రెండుసార్లు సమావేశమవుతోంది. మరి చివరకు అధిష్టానం ఏమిచేస్తుందో ? బీసీ నేతలు ఏమంటారో చూడాల్సిందే.