తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం టు ఢిల్లీ వయా బెంగళూరు
ఎవరికి వారుగా వర్గాలు.. అందరూ నాయకులే.. కార్యకర్తలు మాత్రం తక్కువ.. కానీ, కాలం కలిసివచ్చిన రోజు ఆ పార్టీనే పులి అవుతుంది.
By: Tupaki Desk | 5 Sept 2023 4:46 PM ISTఎవరికి వారుగా వర్గాలు.. అందరూ నాయకులే.. కార్యకర్తలు మాత్రం తక్కువ.. కానీ, కాలం కలిసివచ్చిన రోజు ఆ పార్టీనే పులి అవుతుంది. పదేళ్లు అధికారానికి దూరమైనా.. మరో పదేళ్లు పాలించమంటూ ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తుంటారు. ఇదంతా కాంగ్రెస్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగానూ ఆ పార్టీ పరిస్థితి ఇలానే ఉంటుంది. పూర్తిగా వెనుకబడినట్లుగా కనిపించే పార్టీ.. ఒక్కసారిగా రేసులోకి దూసుకొస్తుంది. అధికారాన్నీ కైవసం చేసుకుంటుంది. ఉమ్మడి ఏపీలో 1994-2004 మధ్య కాంగ్రెస్ పార్టీ అనేక కష్టాలు చూసింది. 1994లో అయితే కేవలం 26 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. కానీ, 2004లో దాదాపు 200 సీట్లు సాధించగలిగిందా పార్టీ. ఎవరెటు పోయినా.. కనీసం 20 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ సొంతం.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇది ఆ పార్టీని బాధించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెలలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) భేటీని నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ నేతలు పర్యటనలు చేయనున్నారు. అన్నిటికీ మించి సీడబ్ల్యూసీకి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ హాజరుకానున్నారు. ఎవరేమి చెప్పినప్పటికీ తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న శక్తి సోనియా గాంధీనే. ఇప్పుడామెనే నేరుగా రాష్ట్రానికి వచ్చి రెండు రోజులు ఉండడమే కాక.. ఎన్నికల్లో ప్రజలకు తమ పార్టీని గెలిపించాలని పిలుపునివ్వనున్నారు. దీంతో సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయనున్నారు.
బెంగళూరు నుంచే అన్నీ
కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానమే సుప్రీం. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాజకీయాలన్నీ నేరుగా ఢిల్లీ పెద్దలతో జరిగేవి. నియామకాలు, ప్రభుత్వంపై ఫిర్యాదులు ఇలా ఏమి ఉన్నా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానానికి నివేదించేవారు. దీనిని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు తప్పుబట్టేవి కూడా. అయితే, ఉమ్మడి ఏపీ విడిపోయాక కాంగ్రెస్ విభజిత ఏపీలో నిర్వీర్యమైంది. అక్కడ పార్టీ కార్యక్రమాలే లేవు. మళ్లీ గెలుస్తుందనే ఆశలూ లేవు. మిగిలింది తెలంగాణ. ప్రత్యేక రాష్రం ఇచ్చిన పార్టీగా ఇక్కడ కాంగ్రెస్ కు ఆదరణ ఉంది. అందులోనూ బలమైన నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ మరింత జోరు చూపుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించే అవకాశం కూడా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడొక విషయం ఏమంటే.. అధిష్ఠానానికి, తెలంగాణ కాంగ్రెస్ కు నడుమ బెంగళూరు వారథిగా నిలుస్తోంది.
షర్మిల పార్టీ విలీనం సహా..
అన్న ఏపీలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీ చివరకు కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. రెండేళ్ల కిందట ఆమె పార్టీని స్థాపించిన సమయంలో ఇది ఎవరూ ఊహించనిది. కానీ, దీనివెనుక కర్ణాటక రాజధాని బెంగళూరు దౌత్యం ఫలించింది. ఇదొక్కటే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన చాలా అంశాలు బెంగళూరు మీదుగానే అధిష్ఠానానికి చేరుతున్నాయి. తెలంగాణ నేతలు సైతం ఇదే మార్గంలో ముందుగా బెంగళూరు చెవిలో ఓ మాట వేసి వస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇటీవల బెంగళూరు వెళ్లి పార్టీకి సంబంధించిన చర్చలు సాగించడం గమనార్హం. టి కాంగ్రెస్ విభేదాలను చక్కదిద్దడం నుంచి మధ్యవర్తిత్వం వరకు అన్నీ బెంగళూరే.
ఆ గెలుపు ప్రభావం.. ఆ శక్తి డీకే శివకుమార్..
వాస్తవానికి ఆరు నెలల కిందటివరకు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటకలో ఘన విజయం సాధించడంతో పక్కనున్న తెలంగాణపైనా ఆశలు పెరిగాయి. ఇదే సమయంలో బీజేపీ వెనక్కుపోవడంతో తెలంగాణ తమకు చిక్కడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేస్తున్న బెంగళూరులో ఓ శక్తి ఉంది. అది అధిష్ఠానానికి నమ్మిన బంటు. ఆయన పేరు డీకే శివకుమార్. ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన .. వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలపడం నుంచి తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దడం వరకు అన్నిట్లోనూ తనదైన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విషయంలో అధిష్ఠానానికి శివకుమార్ చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంది పరిస్థితి. అందులోనూ శివకుమార్.. ఒకప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డిలా కాంగ్రెస్ కు నమ్మిన బంటు. కలలోనైనా పార్టీకి చేటు చేయని వ్యక్తిత్వం ఆయనది. దీంతోనే అధిష్ఠానానికి ఎంతో ఇష్టుడయ్యారు. మరి.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పై బెంగళూరు (డీకే శివకుమార్) ఇంకెంత ప్రభావం చూపుతుందో?
