Begin typing your search above and press return to search.

అసెంబ్లీ పోటీకి టి కాంగ్రెస్ సీనియర్ల వైరాగ్యం

ఇక తెలంగాణ కాంగ్రెస్ పై బలమైన ముద్ర మాజీ మంత్రి జానారెడ్డిది. చలకుర్తి, నాగార్జున సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జానా.. 2018 ఎన్నికల్లో పరాజయంతో వెనుకబడ్డారు.

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:12 AM GMT
అసెంబ్లీ పోటీకి టి కాంగ్రెస్ సీనియర్ల వైరాగ్యం
X

ఒకరా? ఇద్దరా..? పదుల సంఖ్యలో నాయకులు.. అందరూ సీనియర్లే.. దశాబ్దాల అనుభవం ఉన్నవారే. చాలాసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారే. అయితే ఈ సారి మాత్రం దూరంగా ఉంటున్నారు. వయసు మీద పడడం.. వారసులకు మార్గం సుగమం చేయడం.. కొంత రిస్క్ తో కూడుకున్నది కావడంతో శాసన సభ బరిలో నిలవడం లేదు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల గురించి. ఒకవేళ పార్టీకి ఊపు ఉండి.. అంటే అధికారంలో కొనసాగుతూ ఉండి ఉంటే వీరంతా తామంటే తామంటూ అసెంబ్లీ కదనంలో నిలిచేవారే.

జానా అలా.. వీహెచ్ ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో వీ హనుమంతరావుది దాదాపు ఐదు దశాబ్దాల పాత్ర. 1990లోొనే పీసీసీ చీఫ్ గా పనిచేశారాయన. ఓ దశలో సీఎం పదవికీ ఆయన పేరు ప్రస్తావనకు వచ్చిందని చెబుతారు. అయితే, వర్గ సమీకరణాలతో అది చేజారిందని వాపోతుంటారు వీహెచ్. కాగా, ఆయన రాజ్య సభ సభ్యుడిగా రెండుసార్లు పనిచేశారు. అంబర్ పేట నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. ఈ సారి మాత్రం అసెంబ్లీ టికెట్ కు దరఖాస్తే చేయలేదు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ పై బలమైన ముద్ర మాజీ మంత్రి జానారెడ్డిది. చలకుర్తి, నాగార్జున సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జానా.. 2018 ఎన్నికల్లో పరాజయంతో వెనుకబడ్డారు. రెండేళ్ల కిందట సాగర్ ఉప ఎన్నికలో బరిలో దిగినా ఓటమి తప్పలేదు. ఈయన కూడా కాంగ్రెస్ టికెట్ కు దరఖాస్తు పెట్టుకోలేదు. సాగర్ నుంచి పెద్ద కుమారుడు రఘువీర్ ను, మిర్యాలగూడ నుంచి చిన్న కుమారుడు జైవీర్ ను బరిలో దింపాలని చూస్తున్నారు.

నాగం, గీతారెడ్డి కూడా..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ ను నాగం జనార్దన్ రెడ్డిని వేరుగా చూడలేం. టీడీపీ హయాంలో మంత్రిగా నాగం ఏకఛత్రాధిపత్యం సాగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన పేరు తెలియని వారుండరు. అయితే, తెలంగాణ విషయంలో విభేదించిన నాగం టీడీపీని వీడారు. మొదట బీజేపీలో, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నాగం పోటీకి ఆసక్తి చూపలేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నప్పుడు గీతారెడ్డి అడ్డా. అక్కడినుంచి గెలిచిన ఆమె మంత్రిగానూ పనిచేశారు. పునర్విభజన అనంతరం గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గానికి మారారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈసారి పోటీకి దిగడం లేదు.

కొండా మురళీ.. రేణుకా చౌదరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అంటే తెలియని వారుండరు. ఆయన భార్య కొండా సురేఖ వైఎస్ హయాంలో పరకాల నుంచి గెలిచారు. అయితే, సురేఖ వరంగల్ లోని అసెంబ్లీ దరఖాస్తు చేసినా.. మురళి మాత్రం ఆసక్తి చూపలేదు. తమ కుటుంబానికి రెండు సీట్లు అడుగుతున్న వీరు కుమార్తెను బరిలో దింపుతామని గతంలో ప్రకటించారు.

ఇక రేణుకా చౌదరి అంటే ఖమ్మం జిల్లా నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసినవారే. కాంగ్రెస్ హయాంలో జాతీయ స్థాయిలో హవా సాగించిన రేణుకా.. ఖమ్మం ఎంపీ సీటుపైనే ఫోకస్ పెట్టినట్టున్నారు. అసెంబ్లీ బరిలో దిగి ఒకప్పటి తన వర్గంలోని పువ్వాడ అజయ్ కుమార్ (బీఆర్ఎస్)ను ఢీకొట్టే అవకాశం ఉన్నప్పటికీ విస్మరించారు.

లోక్ సభ బరిలో కోసమా? అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు కోరగా.. వెయ్యికి పైగా వచ్చాయి. గడువు శుక్రవారంతో ముగిసింది. దరఖాస్తులను వడపోసి త్వరలో అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించనుంది. సీనియర్ నాయకులు కొందరిని లోక్ సభ బరిలో దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తోందనే వాదన ఉంది. అంతేకాక.. కుటుంబానికి ఒకటే టికెట్ అనే నిబంధనను కూడా విధించినట్లు తెలుస్తోంది. అందుకనే సీనియర్ నాయకులు ఎన్నికలకు దూరంగా ఉన్నారని.. వారసులను బరిలో దింపే ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.