Begin typing your search above and press return to search.

తెలంగాణా కాంగ్రెస్ కు అధిష్టానమే షాకిచ్చిందా ?

ఇలాంటి తెలంగాణా సీనియర్లలో ఎవరికైనా కమిటిలో సభ్యత్వం ఇచ్చుంటే బాగుండేది

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:30 AM GMT
తెలంగాణా కాంగ్రెస్ కు అధిష్టానమే షాకిచ్చిందా ?
X

తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సీడ్బ్యూసీ)ని నియమించారు. 39 మందితో నియమించిన కమిటిలో తెలంగాణాకు పూర్తి అన్యాయమే జరిగింది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కమిటిలో మంచి ప్రాధాన్యత లభిస్తుందని అందరు అనుకుంటున్నారు. అలాంటిది తెలంగాణా నేతల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవటమే షాకింగుగా ఉంది.

39 మంది సభ్యుల్లో 32 మంది శాశ్వత సభ్యులుగా నియమించగా మరో 13 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఏపీ నుండి శాశ్వత సభ్యుడిగా రఘువీరారెడ్డిని నియమించిన ఖర్గే తెలంగాణాలో నుండి ఒక్కరిని కూడా తీసుకోలేదు. రఘువీరాని తీసుకోవటం కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్ కు రఘువీరా దాదాపు నాలుగేళ్ళుగా దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధి పాదయాత్ర సందర్భంగా మాత్రం రఘువీరా కాస్త యాక్టివ్ గా కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ లేరు.

అలాంటి రఘువీరాకు కమిటిలో చోటు కల్పించిన ఖర్గే తెలంగాణాలో ఎంతోమంది యాక్టివ్ గా ఉన్న సీనియర్లను ఎందుకు పక్కకు పెట్టేశారో తెలీటంలేదు. పైగా ఏపీలో కాంగ్రెస్ కోమాలోకి వెళ్ళిపోయా దాదాపు 10 ఏళ్ళవుతోంది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణాలో కాంగ్రెస్ చాలా యాక్టివ్ గా ఉన్నట్లే లెక్క.

పైగా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి తెలంగాణా సీనియర్లలో ఎవరికైనా కమిటిలో సభ్యత్వం ఇచ్చుంటే బాగుండేది. మరి ఇవన్నీ ఖర్గే ఆలోచించకుండానే కొత్త కమిటీని నియమించుంటారా అనే సందేహం కూడా పెరిగిపోతోంది. ఖర్గే ఏమి ఆలోచించారో ఎవరికీ తెలీదు కానీ తెలంగాణాకు మొండిచెయ్యి ఇచ్చిందని మాత్రం అందరికీ కనబడుతోంది. దీన్ని అధిష్టానం ఎలా సమర్ధించుకుంటుందో ఆసక్తిగా మారింది. ప్రత్యేక ఆహ్వానితులుగా దామోదర రాజనర్సింహా, వంశీచంద్ రెడ్డిని తీసుకున్నా అదేమంత చెప్పుకోదగ్గవి కాదు.