Begin typing your search above and press return to search.

'8' స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!

వరుస పెట్టి అభ్యర్థుల పేర్లను తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ

By:  Tupaki Desk   |   28 March 2024 4:15 AM GMT
8 స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!
X

వరుస పెట్టి అభ్యర్థుల పేర్లను తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 8 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. తాజాగా ఈ ఎనిమిది స్థానాల్లో నలుగురిని బరిలోకి దించేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు.

తాజాగా ఎంపిక చేసిన అభ్యర్థుల విషయానికి వస్తే..

1. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి

2. మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్

3. అదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ

4. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఇప్పటివరకు తెలంగాణలోని పదమూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఫైనల్ చేయగా.. ఖమ్మం.. వరంగల్.. కరీంనగర్.. హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక మీద చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ అగ్ర నాయకురాలు సోనియా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపా దాస్ మున్షీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మొత్తం ఐదు రాష్ట్రాల (తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గోవా)కు చెందిన అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం గోవా మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 14 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

తాజాగా ఎంపిక చేసిన నాలుగు పేర్లలో ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే సీనియర్ నేతగా చెప్పాలి. మిగిలిన ముగ్గురు తొలిసారి ఎంపీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. మెదక్ అభ్యర్థిగా ఎంపిక చేసిన నీలం మధు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. పటాన్ చెర్వు అభ్యర్థిగా భావించినా టికెట్ దక్కలేదు. దీంతో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.