Begin typing your search above and press return to search.

రేవంత్‌ ఓకే.. మరి ఉత్తమ్, కోమటిరెడ్డి అందుకు సిద్ధమేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది

By:  Tupaki Desk   |   27 Oct 2023 11:12 AM GMT
రేవంత్‌ ఓకే.. మరి ఉత్తమ్, కోమటిరెడ్డి అందుకు సిద్ధమేనా?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి.

2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) పన్నిన వ్యూహం ఫలించింది. కాంగ్రెస్‌ లో కీలక నేతలందరినీ ఓడించడమే లక్ష్యంగా నాడు టీఆర్‌ఎస్‌ వ్యూహం పన్నింది. దీంతో కొడంగల్‌ నుంచి రేవంత్‌ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గద్వాల నుంచి డీకే అరుణ, జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య, జగిత్యాల నుంచి జీవన్‌ రెడ్డి, నాగార్జున సాగర్‌ నుంచి జానారెడ్డి.. ఇలా కీలక నేతలందరినీ ముందు నుంచీ లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ఓడించింది.

ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్‌ కూడా అమలు చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. దాదాపు ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కేసీఆర్‌ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. కోమటిరెడ్డి సైతం కేసీఆర్‌ పై పోటీకి సిద్ధమని సవాల్‌ విసిరారు.

ఇక బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలయిన కేసీఆర్‌ కుమారుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పై కాంగ్రెస్‌ సీనియర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఈసారి కూడా సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అయితే ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలరని చర్చ నడుస్తోంది.

మరోవైపు కేసీఆర్‌ మేనల్లుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పోటీ చేస్తున్న సిద్ధిపేట నుంచి కాంగ్రెస్‌ మరో సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దింపే యోచన చేస్తోందని అంటున్నారు.

అయితే.. కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలు కామారెడ్డి నుంచి రేవంత్‌ రెడ్డి, గజ్వేల్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. కాగా కేటీఆర్, హరీశ్‌ పోటీ చేస్తున్న సిరిసిల్ల, సిద్ధిపేటల నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారా, లేదా అనేది మాత్రం వారిద్దరూ చెప్పడం లేదు. కాంగ్రెస్‌ అధిష్టానం ఏం ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.

ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి, రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నుంచి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మునుగోడు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గాలు కాకుండా రెండో నియోజకవర్గం నుంచి కూడా సీనియర్‌ నేతలను బరిలో దించి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలకు షాకివ్వాలనే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.

అయితే ఇందుకు పీసీసీ అ«ధ్యక్షుడు రేవంత్‌ సిద్ధంగా ఉన్నా మిగతా సీనియర్‌ నేతలు మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. మరి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం ఫలిస్తుందో, లేదో చూడాలి.