Begin typing your search above and press return to search.

బండికి కాంగ్రెస్ ప్రత్యర్థి ఎవరు? ఎంతకూ తేల్చరే?

తెలంగాణలో మొత్తం 17 సీట్లకు గాను లోక్ సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా లేదంటే ఆసక్తికరంగా జరిగే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి

By:  Tupaki Desk   |   9 April 2024 4:30 PM GMT
బండికి కాంగ్రెస్ ప్రత్యర్థి ఎవరు? ఎంతకూ తేల్చరే?
X

తెలంగాణలో మొత్తం 17 సీట్లకు గాను లోక్ సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా లేదంటే ఆసక్తికరంగా జరిగే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మల్కాజిగిరి, మెదక్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. మల్కాజిగిరి, మెదక్ లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిర్ణయించేసినా.. మిగతా మూడుచోట్ల మాత్రం ఆచితూచి వెళ్లాలని చూస్తోంది.

అటు ఉత్తరం ఇటు దక్షిణం మధ్యన నగరం

కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచిన మూడు సీట్లలో కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఉండగా, ఖమ్మం దక్షిణ తెలంగాణలో ఉండి. ఇక హైదరాబాద్ నగరం వీటి మధ్యన ఉంది. అయితే, ఖమ్మం వీటిలో హస్తం పార్టీకి పెట్టని కోట. కరీంనగర్ మాత్రం క్రమంగా చేజారుతోంది. 2009 తర్వాత అక్కడ పార్టీ నెగ్గలేదు. తెలంగాణ వాదం బలంగా ఉన్న క్రమంలో వెనుకబడిపోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ సీటు ఈ సీటు అని లేదు. అన్నిటినీ గెలిస్తేనే విలువ ఉంటుంది.

కరీంనగర్ తేల్చరేం?

కరీంగనర్ నుంచి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున బండి సంజయ్ అనూహ్యంగా గెలిచారు. అది ఆయన రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇప్పుడు మరోసారి బరిలో నిలిచారు. ఇక 2004, 2014లో కరీంనగర్ లో విజయం సాధించిన బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓడిపోయిన వినోద్ కుమార్ కే మళ్లీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రమే ఎంతకూ తేల్చడం లేదు. వాస్తవానికి సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. జగిత్యాల నుంచి పలుసార్లు గెలిచిన ఆయనకు 2006లో కేసీఆర్ పై ఉప ఎన్నికలో పోటీ చేశారు. కానీ, ఈసారి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పేర్లు పరిశీలిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ వంటి నాయకుడిని ఓడించాలంటే అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి. కానీ, అధికార కాంగ్రెస్ ఇంకా వెనుకంజలో ఉంది. అటు వినోద్ కుమార్ కూడా గట్టి అభ్యర్థే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చాలా సన్నిహితుడు.

కొసమెరుపు: దక్షిణాన ఉన్న ఖమ్మంలో అభ్యర్థి ఎవరనేదానిని బట్టి ఉత్తరంలోని కరీనంగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలనుంది. సామాజిక సమీకరణాలే దీనికి కారణం.