Begin typing your search above and press return to search.

చలో ఢిల్లీ.. పీసీసీనా? ఎమ్మెల్సీనా? మెదక్ లో పోటీనా?

ఎన్నికల సంఘం నిర్ణయం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేల కోటా రెండో ఎమ్మెల్సీ స్థానమూ దక్కుతోంది

By:  Tupaki Desk   |   10 Jan 2024 2:14 PM GMT
చలో ఢిల్లీ.. పీసీసీనా? ఎమ్మెల్సీనా? మెదక్ లో పోటీనా?
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది. మంత్రివర్గంలో ఆరు ఖాళీల భర్తీ, నామినేటెడ్ నియామకాలు, లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధత తదితరాలపై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికైనా ఇస్తారా? లేక సీఎం రేవంత్ రెడ్డినే ఆ స్థానంలో కొనసాగిస్తారా? అన్నది కూడా ముఖ్యమే. తెలంగాణలోని 17 సీట్లలో కనీసం 15 అయినా కాంగ్రెస్ గెలుచుకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీని ఎన్నికల్లో సమర్థంగా నడిపించాల్సిన అవసరం ఉంది.

ఆ ఎమ్మెల్సీ ఆయనకేనా?

ఎన్నికల సంఘం నిర్ణయం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేల కోటా రెండో ఎమ్మెల్సీ స్థానమూ దక్కుతోంది. ఉచితంగా వచ్చినట్లున్న ఈ స్థానం కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మొదటి స్థానాన్ని మైనారిటీ నాయకుడికి కేటాయించడం ఖాయం. కాంగ్రెస్ లో ఒక్క ముస్లింలెవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటే ముస్లింకు ఎమ్మెల్సీ ఇవ్వకతప్పదు. ఇక రెండో స్థానం కోసం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు వినిపిస్తోంది. రెండున్నరేళ్ల కిందట టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించిన ఆయన హల్ చల్ చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవితో సరిపెట్టుకున్నారు. మరోవైపు సంగారెడ్డిలో గెలిచి ఉంటే ఆయనకు చీఫ్ విప్ పదవి అయినా దక్కేదేమో? కానీ, అనుకోకుండా ఎదురైన పరాజయం అవకాశాలను దెబ్బతీసింది.

సీఎంతో భేటీ.. ఢిల్లీకి చలో

జగ్గారెడ్డి మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బుధవారం సాయంత్ర హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సీఎంతో 20 నిమిషాల పాటు జగ్గారెడ్డి చర్చించారు. ఏం మాట్లాడుకున్నదీ ఆయన వెల్లడించలేదు. అయితే, మరుసటి రోజే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఏం జరుగుతున్నదనో ఆసక్తి నెలకొంది. జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కోసమే అయితే ఢిల్లీకి పిలిపించాల్సిన పని లేదని.. ఆయన పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు.

మెదక్ ఎంపీగా కుమార్తెకు టికెట్?

జగ్గారెడ్డి కుటుంబం మొత్తం కాంగ్రెస్ లో పనిచేస్తోంది. ఆయన భార్య నిర్మల సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు మోశారు. జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి కూడా క్రియాశీలంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె లేదా నిర్మల మెదక్ ఎంపీగా పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీనా? పీసీసీ పదవా? మెదక్ టిక్కెటా? జగ్గారెడ్డి కుటుంబానికి దక్కేది ఏమిటనేది ఢిల్లీ పర్యటన ద్వారా స్పష్టతరానుంది.