Begin typing your search above and press return to search.

పదేళ్లు ఏడిపించిన కాంగ్రెస్ కు.. పదేళ్లకు తెలంగాణ ప్రజల పట్టం

పదేళ్ల నిరీక్షింపజేసి తమ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని.. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంచారు తెలంగాణ ప్రజలు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 12:30 PM GMT
పదేళ్లు ఏడిపించిన కాంగ్రెస్ కు.. పదేళ్లకు తెలంగాణ ప్రజల పట్టం
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక కూడా పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులోనూ అనేక అడ్డంకులు ఎదురైనా తెలంగాణ సాకారం చేసింది ఆ పార్టీ. ఆంధ్రా ప్రాంత నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినా వెనుకంజ వేయకుండా హామీని నిలబెట్టుకుంది. ఇక ఇందుకోసం విభజిత ఏపీలో పూర్తిగా ప్రజలకు దూరమైంది. ఆ రాష్ట్రంలో మరో పదేళ్లకైనా కాంగ్రెస్ పైకి లేస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి.

1969లో కారణాలు చెప్పి..

నిజాం పాలన నుంచి విముక్తం అయ్యాక 1948 నుంచి 1956 వరకు ప్రత్యేక రాష్ట్రంగా ఉంది తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం). భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956లో ఆంధ్రా, తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అయితే, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ మొదటి నుంచీ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 1960ల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రేగింది. 1969 నాటికి తీవ్ర రూపం దాల్చింది. చివరకు ఉద్యమకారులను నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపడంతో చల్లారింది. దీనికితోడు 1970ల్లో దేశ సమగ్రతను కారణంగా చూపి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేమని చెప్పింది. మళ్లీ అదే ఉద్యమం 1990ల చివర్లో పురుడు పోసుకుంది. 2001 నుంచి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంతో ఊపు వచ్చింది.

2004 ఎన్నికల్లో అంగీకారం

ఉమ్మడి ఏపీలో సీఎంగా బలమైన నాయకుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రెండుసార్లు వరుసగా కాంగ్రెస్ ను ఓడించారు. 2004 ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీ పరిస్థితి క్లిష్టం కానుందన్న ఆందోళనల నడుమ కాంగ్రెస్ పార్టీ.. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తుపెట్టుకుంది. వామపక్షాలతోనూ కలిసి నడిచి ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. ఆ సందర్భంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ కనీస ఉమ్మడి ప్రణాళికలో చోటిచ్చింది. కానీ, 2014 వరకు తెలంగాణ సాకారం కాలేదు. ఈ వ్యవధిలో విద్యార్థుల బలిదానాలు, ఉద్యమాలు అనేకం సంభవించాయి. చివరకు పదేళ్ల నిరీక్షణ అనంతరం కాంగ్రోస్ పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది.

అందుకే పదేళ్లు నిరీక్షింపజేశారు..

పదేళ్ల నిరీక్షింపజేసి తమ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని.. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంచారు తెలంగాణ ప్రజలు. తాము ఎలాగైతే బలిదానాలు, ఉద్యమాలతో పోరాడామో.. కాంగ్రెస్ పార్టీని కూడా అలాగే పోరాడేలా చేసి గెలిపించారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తారు. తేడా వస్తే ఎంతటివారినైనా పక్కనపెడతారు. తమ ఆత్మగౌరవంతో పదేళ్లు ఆడుకున్న కాంగ్రెస్ ను అందుకనే అంతే వ్యవధి పాటు వేచి చూసేలా చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పై ఆ విధంగా తెలంగాణ ప్రజలు తమ రుణంతో పాటు కసి కూడా తీర్చుకున్నారు.

కొసమెరుపు: పదేళ్లు కాంగ్రెస్ కు అధికారం ఇవ్వని తెలంగాణ ప్రజలు.. పదేళ్ల పాటు పోరాడిన బీఆర్ఎస్ కు పదేళ్లు అధికారం ఇచ్చారు. మరిప్పుడు పదేళ్లు ప్రతిపక్షంలో ఉంచుతారా?