Begin typing your search above and press return to search.

6 కు 36.. కేసీఆర్ లక్కీ నంబరుతో తెలంగాణ కాంగ్రెస్ హుషారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారెంటీలతో హుషారు చూపుతున్న కాంగ్రెస్ 36 హామీలతో జోరు పెంచనుంది

By:  Tupaki Desk   |   18 Nov 2023 12:30 AM GMT
6 కు 36.. కేసీఆర్ లక్కీ నంబరుతో తెలంగాణ కాంగ్రెస్ హుషారు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారెంటీలతో హుషారు చూపుతున్న కాంగ్రెస్ 36 హామీలతో జోరు పెంచనుంది. ఈ మేరకు 36 అంశాలతో శుక్రవారం గాంధీభవన్ లో పార్టీ మేనిఫెస్టోను అధ్యక్షుడు ఖర్గే విడుదల చేశారు. యువత,విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలనూ ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో హామీలు ప్రకటించారు. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ''ఆరు'' అంకె అనేది పరిశీలకుల్లో చర్చనీయాంశం అవుతోంది.

సీఎం సెంటిమెంట్ తో..

తెలంగాణ సీఎం కేసీఆర్ లక్కీ నంబరు 6 అనే సంగతి అందరికి తెలిసిందే. ఏ కార్యక్రమం చేపట్టినా.. ఆయన 6 నంబరు ఉండేలా చూసుకుంటారు. ఆఖరికి తెలంగాణలో కీలకమైన జిల్లాల ఏర్పాటులోనూ 33 (3+3) ఆరు వచ్చేలా చూశారు. ఈ సంఖ్య అంటే.. కేసీఆర్ కు ఎందుకు ఇంత గురో తెలియదు కానీ.. ఆయనకు మాత్రం తగని సెంటిమెంట్ అని సన్నిహితులు పేర్కొంటారు. కాగా, ఈసారి కేసీఆర్ మాత్రం ఆ సెంటిమెంట్ ను పక్కనపెట్టేలా వ్యవహరించారు. కామారెడ్డి, గజ్వేల్ లో నామినేషన్ కు ఈ నెల 9వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. అయితే, దీనికి కారణం.. మంచి రోజులు లేకనే అని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం.. తెలంగాణ ఎన్నికలకు కేసీఆర్ లక్కీ నంబరు 6ను యథేచ్ఛంగా వాడుకుంటోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించిన ఆ పార్టీ శుక్రవారం 36 అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. వాస్తవానికి ఈ 'గ్యారెంటీలు' కర్ణాటక ఎన్నికల అనంతరం వెలుగులోకి వచ్చినవే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చింది ఐదు గ్యారెంటీలే కావడం గమనార్హం. వాటికితోడు బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. ఈ గెలుపు ఇచ్చిన ఊపులో తెలంగాణ కాంగ్రెస్ సైతం గ్యారెంటీలతో ముందుకొచ్చింది. అయితే, ఐదు కాకుండా.. ఆరు గ్యారెంటీలను ప్రకటించడమే గమనార్హం.

మళ్లీ ''ఆరు''

కర్ణాటకలోలా కాకుండా ఐదు గ్యారెంటీలకు బదులు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరు (3'6') రావడం విశేషం. ఇది కేవలం యాక్సిడెంటల్ గానే జరిగినా.. పరిశీలకులు మాత్రం వేరే విధంగా చూస్తున్నారు. కేసీఆర్ లక్కీ నంబరుతోనే ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని అంటున్నారు. తద్వారా సీఎంను సెంటిమెంటల్ గానూ ఓడించినట్లు అవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆరు మారింది..

ఏ పనిచేసినా.. ఏ కార్యక్రమమైనా.. ఆరు అంకె వచ్చేలా చూసుకునే సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం నామినేషన్ తేదీని 9గా నిర్ణయించుకున్నారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి ఆరో తేదీన నామినేషన్ వేయడం గమనార్హం. మరోవైపు ఈ ఇద్దరు నాయకులు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడం కూడా యాక్సిడెంటలే.