Begin typing your search above and press return to search.

అక్కడ కాంగ్రెస్ గాలి.. రుజువు కావాలా...?

కాంగ్రెస్ లో టికెట్ల కోసం ఇంతటి పోరు ఎపుడైనా చూశారా. వారూ వీరూ కాదు అందరూ పొలోమంటూ ఢిల్లీకి వెళ్లిపోతున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 2:30 AM GMT
అక్కడ కాంగ్రెస్ గాలి.. రుజువు కావాలా...?
X

కాంగ్రెస్ గాలి వీస్తోంది అక్కడ. అలా ఇలా కాదు జంఝామారుతం వీస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వపు వైభోగం వచ్చింది అని అంతా భావిస్తున్నారు. అధికారం అన్నది నిన్నటి మాట అని రేపటి కల అని కాడె వదిలేసి దిగాలు పడిన చోట మా పొలంలో కూడా విత్తనాలు మొలుస్తున్నాయి అన్నంత సంబరంగా ఇపుడు కాంగ్రెస్ గాలి వీస్తోంది.

ఆ వ్యవసాయ క్షేత్రమే కాంగ్రెస్. ఆ రాష్ట్రమే తెలంగాణా. దానికి రుజువులు కావాలా అంటే కావాలని అనుకున్న వారికి బోలెడు ఉదాహరణలు కళ్ళ ముందు కనిపిస్తాయి. కాంగ్రెస్ లో టికెట్ల కోసం ఇంతటి పోరు ఎపుడైనా చూశారా. వారూ వీరూ కాదు అందరూ పొలోమంటూ ఢిల్లీకి వెళ్లిపోతున్నారు. హై కమాండ్ ని ఎలాగో కలసి బతిమాలో బామాలో టికెట్ తెచ్చుకుంటే చాలు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినట్లే అని అనుకుంటున్నారు.

ఇక కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది. కానీ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక మాత్రం ఆ ఫలాలను ఎంజాయ్ చేయలేదు. ఇది నిజంగా అత్యంత బాధాకరమైన అంశమే. కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ పని సరి అనుకున్న వేళ ఇపుడు దానికి విరుద్ధంగా అద్భుతాలే జరుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాయలు కాచిన వారు అలా ఉండగానే వారిని తోసుకుంటూ చాలా మంది గేట్లు తీసుకుని మరీ కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు. జాయిన్ అయిపోతున్నారు. టికెట్ కోసం ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కి ఎంతటి డిమాండ్ అంటే మొదటి జాబితా రిలీజ్ అయ్యాక రెండవ జాబితా కోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్ కి వచ్చిన ఈ అనుకూల గాలిని చూసి కాంగ్రెస్ పెద్దలు స్క్రీనింగ్ కమిటీ బాధ్యులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కాంగ్రెస్ కి వచ్చిన ఆ సానుకూలతను ఎలాంటి పొరపాట్లు లేకుండా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఆచీ తూచీ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు.

బెటరెస్ట్ ఆఫ్ ద బెటర్ అన్న లెక్కన వడపోతలు చేస్తూ పోతున్నారు. కాంగ్రెస్ జాబితాలో తమ పేరు కోసం చాలా మంది హస్తిన బాటలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో ఇంతటి ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంటే ప్రత్యర్థి పార్టీలు కూడా ఉలిక్కిపడుతున్నాయి. కొద్ది నెలల క్రితం వరకూ అంతా తామే అన్నీ తామే అని అనుకున్న బీజేపీ అయితే జనసేన తోడు కావాలని అంటోంది. జనసేనకు తెలంగాణాలో ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది తెలియకపోయినా ఏ కొద్ది ఓట్లు వచ్చినా తమకు లాభమే అన్నట్లుగా ఆ పార్టీని అక్కున చేర్చుకుంటోంది.

ఇంకో వైపు బీయారెస్ అధినాయక త్రయం కాంగ్రెస్ నోటి నుంచి ఏ చిన్న ప్రకటన వచ్చినా దానికి ధీటుగా రియాక్ట్ అవుతోంది. కాంగ్రెస్ వస్తే తెలంగాణాలో ఏమీ మిగలదు అని బీయారే హై కమాండ్ జనాలను హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ లో ఎంతమంది సీఎం లు ఉంటారు అని కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు.

ఇక సీఎం ల దాకా వచ్చారు అంటే బీయారెస్ కి కూడా కొంత మ్యాటర్ తెలిసి ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా హస్తం పార్టీకి ఇది మంచి శకునంగానే చూస్తున్నారు. డిసెంబర్ 3 తరువాత కాంగ్రెస్ దే అధికారం అని ఆ పార్టీ వారు నిబ్బరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా అయిదు రాష్ట్రాలలో విజయం ఖాయం అంటోంది. మొత్తానికి ఈసారి తెలంగాణా కాంగ్రెస్ పరం అనే అంటోంది ప్రస్తుత పరిస్థితి.