Begin typing your search above and press return to search.

మనసులో మాట... సీఎం అవుతానంటున్న జగ్గారెడ్డి!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల లిస్ట్ చాంతాడంత ఉంటుంటుంది అని రాజకీయవర్గాల్లో ఒక చలోక్తి సాదారణంగా వినిపిస్తుంటుంది

By:  Tupaki Desk   |   24 Oct 2023 3:47 AM GMT
మనసులో మాట... సీఎం అవుతానంటున్న జగ్గారెడ్డి!
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల లిస్ట్ చాంతాడంత ఉంటుంటుంది అని రాజకీయవర్గాల్లో ఒక చలోక్తి సాదారణంగా వినిపిస్తుంటుంది. దీనికి తగ్గట్లుగానే వ్యవహారం కూడా ఉంటుంటుందని అంటుంటారు. పీసీసీ చీఫ్ పోస్ట్ కు పోటీపడే దగ్గరనుంచి ఈ విషయం బలంగా నానుతుంటుందని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సీఎం అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆలోచించే అన్నారా.. హృదయాంతరాలాల్లో ఎప్పటినుంచో నిక్షిప్తంగా ఉన్న ఆలోచనను విజయదశమినాడు ఇలా బయటపెట్టారో.. అదీగాక, కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా హెచ్చరికలు జారీచేసే ప్రయత్నం చేశారో తెలియదు కానీ... సడన్ గా ముఖ్యమంత్రి పోస్ట్ పై స్పందించారు జగ్గారెడ్డి. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు హాట్ టాపిక్ అయ్యిందనే విషయం కాసేపు పక్కనపెడితే కాంగ్రెస్ సీనియర్ల మధ్య మాత్రం చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు.

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కడికి వచ్చిన మహిళలను ఉద్దేశించి జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సమయంలో అక్కడే బందోబస్తుకు ఉన్న పోలీసులు వీడియో తీయడం చేశారు! దీంతో అది గమనించిన జగ్గారెడ్డి.. పోలీసులపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

జగ్గారెడ్డి మాట్లాడితే వీడియోలు తీస్తారు.. బీఆరెస్స్ నాయకుల మాట్లాడితే వీడియోలు తీయరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా... తాను ఇక్కడ బతుకమ్మ స్టార్ట్ చేసినపుడు సగం మంది పుట్టలేదని మండిపడిన ఆయన... ఎవరు చెబితే వీడియోలు తీస్తున్నారని పోలసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆరెస్స్ నాయకులు మాట్లాడితే మాత్రం వీడియో తీయరు.. ఏం జరుగుతుంది సంగారెడ్డిలో అంటూ ఫైరయ్యారు!

ఇక, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని చెప్పిన జగ్గారెడ్డి... ఎన్నికల కోడ్‌ లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని అన్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిన.. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేకపోయినా తన భార్యతో పాటు అనుచరులు ఉంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతానని చెప్పారు.

ఈ సందర్భంగా తనమనసులో మట చెబుతున్నానంటూ సీఎం పోస్ట్ పై స్పందించారు జగ్గారెడ్డి. ఇందులో భాగంగా... వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి నాడు తన మనసులో మాట చెబుతున్నానని తెలిపారు. ఇదే సమయంలో... సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అంటూ.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!