దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం
ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల ఒత్తిడికి కేసీఆర్ ప్రభుత్వం చివరకు దిగొచ్చింది.
By: Tupaki Desk | 13 Aug 2023 4:00 PM ISTప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల ఒత్తిడికి కేసీఆర్ ప్రభుత్వం చివరకు దిగొచ్చింది. గ్రూప్-2 పరీక్షలను నవంబర్ కు వాయిదా వేస్తు నిర్ణయం తీసుకున్నది. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమైతే ఈనెల 29, 30 తేదీల్లో జరగాలి. ఈ షెడ్యూల్ ను టీఎస్పీఎస్సీ దాదాపు రెండు నెలల క్రితమే నిర్ణయించింది. అయితే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల పరీక్షలు, గురుకుల ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు.
అన్ని పోటీ పరీక్షల తేదీలు కూడా ఇంచుమించు దగ్గర దగ్గరలో ఉన్నాయి. ఒకేసారి ఇన్ని పరీక్షలకు హాజరవ్వడం కష్టం కాబట్టి గ్రూపు 2 పరీక్షలను వాయిదావేయాలని నిరుద్యోగులు, విద్యార్థులు టీఎస్పీఎస్సీ ఆపీసు ముందు పెద్ద ఆందోళన చేశారు. అలాగే ఇదే విషయమై హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. వివిధ పరీక్షల తేదీలను పరిశీలించిన హైకోర్టు గ్రూప్ 2 పరీక్షల వాయిదాపై ఏ నిర్ణయం సోమవారం కల్లా తీసుకోవాలని డెడ్ లైన్ విధించింది.
కోర్టు పెట్టిన డెడ్ లైన్, విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళన, ప్రతిపక్షాల ఒత్తిడికి చివరకు ప్రభుత్వం తలొంచేసింది. తేదీలను ప్రకటించలేదు కానీ గ్రూప్ 2 పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసినట్లు ముందు మంత్రి కేటీయార్ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. తర్వాత ఇదే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వివిధ పోటీ పరీక్షలను వెంటవెంటనే నిర్వహించే బదులు కనీసం నెల రోజుల వ్యవధన్నా ఉండేట్లు మొదట్లోనే ప్రభుత్వం చూసుకునుంటే ఇపుడీ సమస్య తలెత్తేది కాదు.
అసలే నిరుద్యోగులు, విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపోతున్నారు. దీనికితోడు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులు, విద్యార్ధులతో ఘర్షణ పెట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో డ్యామేజీ తప్పదని భయపడినట్లుంది. అందుకనే నిరుద్యోగులు, విద్యార్ధులను మంచి చేసుకునేందుకు వాళ్ళడిగినట్లే పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం బిల్డప్ ఇచ్చింది. షెడ్యూలింగ్ సమయంలోనే గ్యాప్ ఉండేట్లుగా చూసుకునుంటే గొడవలు, కోర్టులో కేసులు ఉండేవే కావన్న ఆలోచన లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. మరి నవంబర్ లో పరీక్షల నిర్వహణ తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.
