Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక అంచున తెలంగాణ.. ఖైరతాబాద్? సికింద్రాబాద్?

అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇద్దరూ ఓడిపోవడంతో ఉప ఎన్నిక అవసరమే రాలేదు

By:  Tupaki Desk   |   25 March 2024 10:34 AM GMT
ఉప ఎన్నిక అంచున తెలంగాణ.. ఖైరతాబాద్? సికింద్రాబాద్?
X

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఎక్కడా రాలేదు. అయితే, 119 స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగేలా ఎన్నికల సంఘం విశేషంగా ప్రయత్నించింది. అయితే, కామారెడ్డిలో ఉప ఎన్నిక తప్పదా? అనే పరిస్థితి ఓ దశలో వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇద్దరూ ఓడిపోవడంతో ఉప ఎన్నిక అవసరమే రాలేదు.

మరి ఇప్పుడు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం అవుతున్న సమయంలో మరో ఉప ఎన్నిక తప్పడం లేదు. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన లాస్య నందిత అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను పరస్పర అంగీకారంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏకగ్రీవం చేస్తాయా? లేదా? చూడాలి.

రెండో ఉప ఎన్నిక తప్పదా?

కామారెడ్డిలో ఉప ఎన్నిక తప్పిందనుకుంటే.. కంటోన్మెంట్ లో అనివార్యమైంది. సరే.. అది ఏకగీవ్రంతో సరిపెట్టుకుంటారని అనుకుంటే.. సికింద్రాబాద్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? అనే అనుమానం తలెత్తుతోంది. ఎందుకంటే.. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ నుంచి పద్మారావుగౌడ్ (సికింద్రాబాద్ ఎమ్మెల్యే), కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ (కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే), బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిలో కిషన్ రెడ్డి సిటింగ్ ఎంపీ. ఈయనే మరోసారి గెలిస్తే సరే. అలాకాకుండా దానం, పద్మారావు గౌడ్ లలో ఎవరు నెగ్గినా ఖైరతాబాద్, సికింద్రాబాద్ కు ఉప ఎన్నిక తప్పదు.

కొసమెరుపు: తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాలూ హైదరాబాద్ లోనే ఉన్నాయి. అంతేకాక.. వీటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. దానం, పద్మారావు గౌడ్ ఇద్దరికీ రాజకీయంగా దివంగత పీజేఆర్ అనుచరులు అనే పేరుంది.