Begin typing your search above and press return to search.

బీయారెస్ ఖాతాలో పడని ఆ ఇరవై సీట్లూ...?

అయితే రెండు సార్లు గెలిచిన తరువాత సహజంగానే జనంలో ఉండే వ్యతిరేకత బీయారెస్ ఆశలను ఎంతవరకూ నెరవేరుస్తుంది అన్నది చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 11:30 PM GMT
బీయారెస్ ఖాతాలో పడని ఆ ఇరవై సీట్లూ...?
X

బీయారెస్ తెలంగాణాలో బలమైన పార్టీ అని ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. తెలంగాణాలో టోటల్ గా 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014లో 61 సీట్లు సాధించిన బీయారెస్ 2018 నాటికి దాదాపుగా తొంబై సీట్లకు రీచ్ అయింది. ఈసారి వందకు పైగా గెలుస్తామని అంటోంది. కానీ తెలంగాణాలో బీయారెస్ పుట్టాక ఈ రోజుకీ టచ్ చేసి గెలవని సీట్లు ఇరవైకి పైగా ఉన్నాయంటే ఆశ్చర్యమే. అంటే ఆ ఇరవైని తీసేసి మిగిలిన వాటిలోనే బీయారెస్ లెక్క చెప్పుకోవాలా. మెజారిటీ అక్కడే చూసుకోవాలా అన్న చర్చ కూడా ఉందిపుడు.

ఇంతకీ బీయారెస్ బలంగా గ్రాస్ రూట్ లెవెల్ దాకా వెళ్లాక కూడా ఇంకా ఇరవై నుంచి పాతిక సీట్లలో ఎందుకు జెండా పాతలేదు, కీలకమైన జిల్లాలలో చాలా నియోజకవర్గాలలో బీయారెస్ ఎందుకు గెలవలేదు అన్నది ఆసక్తికరమైన విషయం గానే ఉంది మరి. బీయారెస్ టచ్ చేయని జిల్లాల విషయానికి వస్తే ముందుగా ఖమ్మం గురించే చెప్పుకోవాలి.

ఇక్కడ 2014 ఎన్నికల్లో ఇల్లెందు అసెంబ్లీ సీటుని మాత్రమే బీయారెస్ గెలిచింది. మిగిలినవి అన్నీ కాంగ్రెస్ వైసీపీలకు పోయాయి. ఇక 2018 నాటికి వస్తే బీయారెస్ ఖమ్మం సీటుని మాత్రమే గెలుచుకుంది. జిల్లాలో మిగిలిన అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇలా ఖమ్మం గుమ్మంలో బీయారెస్ కి ఎపుడూ చుక్కెదురు అవుతోంది అని అంటున్నారు.

అలాగే హైదరాబాద్ లో కూడా బీయారెస్ కి పట్టు తక్కువ అని అంటారు. ఇక్కడ కూడా చాలా నియోజకవర్గాలలో బీయారెస్ జెండా పాతలేదు. దానికి అచ్చమైన ఉదాహరణ గోషామహల్ సీటు, ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడితే ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. 2014, 2018లలో రెండు సార్లు బీజేపీ తరఫున రాజా సింగ్ గెలిచారు. ఇక పాతబస్తీలో ఉన్న చాలా నియోజకవర్గాలలో మజ్లీస్ పార్టీతో ఉన్న అవగాహన మేరకు బీయారెస్ పెద్దగా పోటీ ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. దాంతో అక్కడ బీయారెస్ జెండా గడచిన రెండు ఎన్నికల్లోనూ ఎగరని పరిస్థితి ఉంది.

ఈ సీట్లే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోనూ చాలా సీట్లు బీయారెస్ నేటికీ గెలుచుకోని పరిస్థితి ఉంది అని అంటున్నారు. 2014లో కొంతమందిని 2018లో మరింత మందిని ఇతర పార్టీల నుంచి బీయారెస్ తన పార్టీలోకి చేర్చుకుని ఈ జిల్లాలలో బలోపేతం అయినా తన సొంత జెండా మీద మాత్రం గెలిచింది లేదు అని అంటున్నారు. ఈసారి తమ పార్టీలో చేరిన వారి బలంతో అయినా ఈ జిల్లాలలో జెండా పాతాలని బీయారెస్ చూస్తోంది.

అయితే రెండు సార్లు గెలిచిన తరువాత సహజంగానే జనంలో ఉండే వ్యతిరేకత బీయారెస్ ఆశలను ఎంతవరకూ నెరవేరుస్తుంది అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా బీయారెస్ చాలా చోట్ల గెలిచి చూపించింది. 2014 ముందు ఉద్యమ పార్టీగా మాత్రమే ఉంది. అధికారంలోకి వచ్చకా క్షేత్ర స్థాయిలో బలపడింది. అయినా సరే ఈ రోజుకూ కొన్ని జిల్లాలలో పూర్తి పట్టు దక్కపోవడం మాత్రం బీయారెస్ కి పెద్ద సవాల్ గానే ఉంది. చూడాలి మరి ఈసారి బీయారెస్ ఆశలు ఎంతమేరకు నెరవేరుతాయో ఏమో అన్నది.