అసంతృప్తులు నెంబరు పెరుగుతోంది సారూ ?
అంతా అయిపోయిన తర్వాత ఇపుడు తీరిగ్గా కేటీయార్ బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. అయినా పెద్దగా వర్కవుటవుతున్నట్లు లేదు.
By: Tupaki Desk | 17 Sept 2023 8:00 PM ISTరాబోయే ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ లో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అసంతృప్తులను బుజ్జగించటంలో కేసీయార్, కేటీయార్ ఒకపుడు లైటుగా తీసుకున్నారు. నేతల్లో ఎంత అసంతృప్తున్నా కనీసం పట్టించుకోలేదు. దాంతో మండిపోయిన వాళ్ళల్లో కొందరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇలా రాజీనామాలు చేస్తున్న వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరుతుండటంతో తమ గెలుపుపై ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అంతా అయిపోయిన తర్వాత ఇపుడు తీరిగ్గా కేటీయార్ బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. అయినా పెద్దగా వర్కవుటవుతున్నట్లు లేదు.
తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, కేసీయార్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కూచాడి శ్రీహరిరావు నిర్మల టికెట్ ఆశించారు. రాకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు. నకిరేకల్ కు చెందిన మాజీ ఎంఎల్ఏ వేముల వీరేశం కూడా టికెట్ ఆశించి రాకపోవటంతో భంగపడ్డారు.
గిడ్డుంగుల సంస్ధ మాజీ ఛైర్మన్ మందుల సామేల్ తుంగతుర్తి నుండి టికెట్ ఆశిస్తే అది దక్కకపోవటం రాజీనామా చేశారు. ఖానాపూర్ ఎంఎల్ఏ రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కూడా రాజీనామా చేసేశారు.
గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత సైతం ఆశించిన టికెట్ దక్కకపోవటంతో పార్టీకి రాజీనామా చేసేశారు. తాజాగా మానకొండూరు మాజీ ఎంఎల్ఏ ఆరే మోహన్ కూడా నిరాసతో పార్టీకి రాజీనామా చేసేశారు. ఇదే బాటలో తొందరలోనే తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు, శాసనమండలి మాజీ డిప్యుటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, మాజీ ఎంఎల్ఏ నల్లాల ఓదేలు, ఎంఎల్ఏ రేఖానాయక్ లాంటి చాలామంది పార్టీకి రాజీనామాలు చేయబోతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇప్పటికే రాజీనామాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే నియోజకవర్గాలున్నవి 119 మాత్రమే. అయితే టికెట్లు ఆశించే వాళ్ళు అంతకుమించి ఉన్నారు. అలాంటపుడు ఆశావహులకు కేసీయార్ లేదా కేటీయార్ ఏమని హామీలిచ్చారో తెలీదు. పార్టీలో చేర్చుకునేటపుడు లేదా టికెట్ అడిగినపుడు స్పష్టంగా ఉంటే ఇపుడిన్ని సమస్యలు తలెత్తేవికావు. కానీ నేతలను చేర్చుకునేటపుడు నోటికొచ్చిన హామీలిచ్చేసి చివరకు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు రివర్సవుతారని తెలీదా ? పార్టీకి నష్టమని తెలీదా ? ఇపుడు బీఆర్ఎస్ లో జరుగుతున్నది అదే. చివరకు ఏమి జరుగుతున్నదో చూడాలి.
