తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు... మాకు టిక్కెట్లు వద్దు ప్లీజ్!?
చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తెలంగాణ బీజేపీ తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Oct 2023 10:13 AM ISTచాలా రోజుల సస్పెన్స్ తర్వాత తెలంగాణ బీజేపీ తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 52 మంది, అందులో 12 మంది మహిళలతో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ఇప్పటికే బీఆరెస్స్, 55 మందితో కాంగ్రెస్ తొలిజాబితా విడుదల చేసిన నేపథ్యంలో... బీజేపీ విడుదల చేయబోయే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతుండటం గమనార్హం.
ఈ తొలిజాబితాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెషన్ ఎత్తివేసింది బీజేపీ. తొలివిడత అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో కమలం పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో... ఈ ఫస్ట్ లిస్ట్ లో గోషామహల్ నియోజకవర్గం టిక్కెట్ రాజాసింగ్ కే కన్ ఫాం చేసింది బీజేపీ అధిష్టాణం! అయితే ఈ లిస్ట్ లో పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడంతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఎదురైన ఘోర పరాభవం అనంతరం తెలంగాణ ఎన్నికలను బీజేపీ పెద్దలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారానే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో... పలువురు కీలక నేతలు, సీనియర్ నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆయన నేతల అభిమానులు టెన్షన్ లో ఉన్నారని అంటున్నారు.
తొలుత... సీఎం కేసీఆర్ ఈ సారి రెండు చోట్ల పోటీ చేస్తున్న చెప్పిన నేపథ్యంలో... ఆయనపై హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ టిక్కెట్ కూడా ఈటెలకు కేటాయించింది అధిష్టాణం. ఈసారి కేసీఅర్ తో నేరుగా తలపడి ఓడిస్తానని చెబుతున్న రాజేందర్ ఈసారి గజ్వేల్ లో తలపడనున్నారు. ఇలా రెండు స్థానాల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పోటీ చేయబోతోన్న కామారెడ్డి నియోజకవర్గంపై కూడా బీజేపీ దృష్టి సారించిందని కథనాలొచ్చాయి.
ఇందులో భాగంగా... కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పై బీజేపీ నుంచి విజయశాంతిని పోటీకి నిలబెట్టబోతున్నారని అన్నారు! అయితే... తొలివిడత జాబితాలో ఆ నియోజకవర్గాన్ని వెంకటరమణారెడ్డికి ఎంపిక చేసింది బీజేపీ అధిష్టాణం. దీంతో ఈ విషయం చర్చనీయాశం అయ్యింది. మరోపక్క మెదక్ అసెంబ్లీ నుంచి పోటీచేయడానికి విజయశాంతి ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలూ వచ్చాయి. అయితే అవేవీ ఫస్ట్ లిస్ట్ లో కనిపించలేదు!
ఇలా విజయశాంతితో పాటు డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి సీనియర్ల పేర్లు కూడా తొలిజాబితాలో లేవు. దీంతో.. ఆందోళన నెలకొందని అంటున్నారు. అయితే ఫస్ట్ లిస్ట్ లో వీరి పేర్లు లేకపోవడానికి వీరి అభిప్రాయాలను అధిష్టాణం పరిగణలోకి తీసుకోవడమే కారణం అని తెలుస్తుంది.
తొలిజాబితాలో ఈ సీనియర్ నేతల పేర్లు లేకపోవడానికి కారణం... వీరంత ఎంపీలుగా పోటీచేయడానికి ఆసక్తి చూపించడమే అని తెలుస్తుంది! ఇలా వీరి ఆసక్తిని, అభిప్రాయాన్ని హస్తినలోని పెద్దల ముందు ఉంచారని.. వీరి అభిష్టాన్ని అధిష్టాణం పరిగణలోకి తీసుకుందని, అందుకే ఎమ్మెల్యేల జాబితాలో వీరి పేర్లు లేవనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
కాగా... రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటి చేసి గెలుపొందగా... డి.కె.అరుణ కూడా 1996లో తన రాజకీయ జీవితాన్ని మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయడంతొనే ప్రారంభించారు! ఇదే క్రమంలో విజయశాంతి కూడా 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి టీఆరెస్స్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
ఇదే సమయంలో తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన జి. వివేక్ కూడా 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దపల్లి లోక్ సభ స్థానానికే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ బొగ్గు - ఉక్కు కమిటీల సభ్యుడిగా పనిచేశారు. అదే విధంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా 2014 ఎన్నికల్లో చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇదే క్రమంలో... జితేందర్ రెడ్డి కూడా 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించి 13వ లోక్ సభకు ఎన్నికయిన సంగతి తెలిసిందే!
