Begin typing your search above and press return to search.

టీబీజేపీలో రెండు వర్గాలు?

బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఓ వర్గం నేతలు అధిష్ఠానంపై అలకతో ఉన్నారని తెలిసింది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 4:38 AM GMT
టీబీజేపీలో రెండు వర్గాలు?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ జోరు ప్రదర్శిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇక్కడ వెనుకబడుతోంది. ఇప్పటికే రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆ పార్టీకి ఇప్పుడు పార్టీలో అంతర్గత విభేధాలు తలనొప్పిగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా బీజేపీలో ఓ వర్గం రహస్య సమావేశాలు నిర్వహిస్తుండటమే అందుకు నిదర్శనమని అంటున్నారు.

బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఓ వర్గం నేతలు అధిష్ఠానంపై అలకతో ఉన్నారని తెలిసింది. అమిత్ షా సభ సందర్భంగా కూడా తమకు తగిన గౌరవం ఇవ్వలేదని ఈ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వర్గంలో ఎక్కువగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకులే ఉన్నారు.

దీంతో వీళ్లంతా కలిసి ఓ వర్గంగా మారారని టాక్. అంతే కాకుండా రహస్యంగా సమావేశాలు కూడా పెడుతున్నట్లు తెలిసింది. ఇటీవల మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయ శాంతి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహన రావు తదితరులు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట్లు సమాచారం.

బీజేపీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదు కాబట్టి ఈ నేతలంతా కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. విజయశాంతి ఇప్పటికే కాంగ్రెస్ ను పొగుడుతూ.. బీజేపీని తక్కువ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

మరోవైపు వివేక్.. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ పరిణామాలు చూస్తుంటే ఈ బీజేపీ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.