Begin typing your search above and press return to search.

టీ బీజేపీ ఖాళీ అవుతోందా...?

ఈ పరిణామాలు చాలవన్నట్లుగా ఇపుడు బీజేపీలో ఉన్న సీనియర్ల చూపు టీ కాంగ్రెస్ మీద పడింది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 1:30 PM GMT
టీ బీజేపీ ఖాళీ అవుతోందా...?
X

తెలంగాణాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే అక్కడ ట్రయాంగిల్ ఫైట్ సాగుతుందని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ గా పోలరైజేషన్ అవుతున్నట్లుగా సన్నివేశం కనిపిస్తోంది. అధికార బీయారెస్ వ్యతిరేక ఓట్ల మీద ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు నిలువునా కాంగ్రెస్ బీజేపీల మధ్యన చీలితే మరోసారి సులువుగా అధికారం దక్కించుకోవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది

అదే ధీమాతో ముందుకు పోతోంది. అసలు తెలంగాణాలో బీజేపీ కీలకమైన శక్తి అన్నట్లుగా ఫోకస్ చేసి ముందుకు తెచ్చింది కూడా బీయారెస్ అని అంటున్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ ని ఏమీ కాకుండా పక్కన పెట్టి బీజేపీతో ఢీ కొట్టడం వెనక స్ట్రాటజీ కూడా ఓట్ల చీలిక అనే అంటున్నారు. అయితే కర్నాటక ఎన్నికల తరువాత సీన్ మొత్తం మారిపోయింది.

కర్నాటకలో కనుక బీజేపీ గెలిచి ఉంటే ఎలా ఉండేదో కానీ అక్కడ ఓడి తెలంగాణాలో చూస్తే కమలం మెల్లగా వాడిపోతోంది. బండి సంజయ్ ని మార్చడంతో వర్గ పోరు ఒక వైపు ఉంది. సీనియర్ నేతల మధ్య అసలు పడడం లేదు. ఈ పరిణామాలు చాలవన్నట్లుగా ఇపుడు బీజేపీలో ఉన్న సీనియర్ల చూపు టీ కాంగ్రెస్ మీద పడింది అని అంటున్నారు. బీయారెస్ ని గద్దె దించాలీ అంటే ధీటైన పార్టీగా కాంగ్రెస్ మాత్రమే ఉంటుందని తెలంగాణా బీజేపీ నేతలు కొందరు నమ్ముతున్నారుట.

దాదాపుగా ఒక పది మంది దాకా మాజీ ఎంపీలు ఇటీవల కలసి దీని మీద చర్చించారని బాంబు లాంటి వార్త అయితే ఇపుడు ప్రచారం అవుతోంది. తెలంగాణాలో బీయారెస్ దించడం ప్రధానం అనుకుంటూ వస్తున్న బీజేపీ నేతలు ఆ పని కమలం పార్టీలో ఉంటే అసలు సాకారం కాదని గ్రహించి మెల్లగా హస్తం గూటికి చేరాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ విషయం మీద ఇప్పటికే అనేకసార్లు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు సమావేశం అయ్యారని ప్రచారం సాగుతోంది. వీరంతా తమలో తాము చర్చించుకోవడమే కాకుండా కాంగ్రెస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు. కాంగ్రెస్ నుంచి కనుక స్పష్టమైన హామీ ఒకటి లభిస్తే మాత్రం పోలోమంటూ ఈ పది మంది మాజీ ఎంపీలే కాదు సీనియర్ నేతలతో పాటు చాలా మంది బీజేపీ నుంచి వెళ్ళి హస్తం పార్టీలో చేరిపోతారు అని టాక్ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

వీరంతా బీయారెస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కావడం విశేషం అంటున్నారు. బీయారెస్ కి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చెక్ పెట్టాలని కూడా చూస్తున్నారు అంటున్నారు. ఆ పని బీజేపీ వల్ల కాదు అని తేలిపోయిన క్రమంలో ఆ పార్టీలో ఇంకా తాము ఉంటే మరోసారి బీయారెస్ అధికారంలోకి వస్తుందని కూడా లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఓట్ల చీలికకు అసలు అవకాశం ఇవ్వకుండా చేయాలంటే కాంగ్రెస్ ని బలోపేతం చేయాలని వారు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

చిత్రమేంటి అంటే మొన్నటిదాకా తెలంగాణాలో బీజేపీదే అధికారం బీయారెస్ ని ఎదుర్కోనేది బీజేపీ మాత్రమే అని చెప్పిన వీరంతా ఇపుడు గులాబీ పార్టీకి చెక్ పెట్టే సత్తా కాంగ్రెస్ కే ఉన్నాయని నూరు శాతం నమ్ముతుండడం, ఇది నిజంగా బీజేపీకి షాకింగ్ పరిణామం అని చెప్పాలి. బీజేపీ నుంచి బిగ్ షాట్స్ ఇలా ఆలోచిస్తూంటే కాంగ్రెస్ కనుక వారిని రమ్మని ఆహ్వానిస్తే మెజారిటీ నాయకులు బీజేపీ నుంచి జంప్ అవుతారు అని అంటున్నారు.

అదే కనుక జరిగితే సరిగ్గా ఎన్నికల వేళ టీ బీజేపీ ఖాళీ అవుతుందా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది అని అంటున్నారు. రానున్న కొద్ది రోజులలో తెలంగాణాలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే సోనియాగాంధీని ఒక బీజేపీ మహిళా మాజీ ఎంపీ పొగడడం వెనక కూడా ఇంటరెస్టింగ్ స్టోరీయే ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా రేపటి ఎన్నికల్లో ఆటలో అరటి పండుగానే బీజేపీ మిగులుతుందా అన్న డౌట్లు అయితే వచ్చేస్తున్నాయట.