Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఈ నలుగురు కీలక నేతలు బీజేపీకి షాక్‌ ఇస్తున్నారా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇక సమయం దగ్గరపడుతోంది. నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 1:43 PM IST
తెలంగాణలో ఈ నలుగురు కీలక నేతలు బీజేపీకి షాక్‌ ఇస్తున్నారా?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇక సమయం దగ్గరపడుతోంది. నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత నవంబర్‌ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ ఇస్తారని.. డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది. సర్వేలు సైతం ఆ పార్టీకి అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీదే గెలుపనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్‌ కు గట్టి పోటీ ఇవ్వడానికి బీఆర్‌ఎస్‌ శతధా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో అధికారం తమదేనంటున్న ఇటీవల వరకు పెద్ద కలలే కన్న బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని, కీలక నేతలు చేరతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకోగా తీవ్ర నిరాశే ఎదురైంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలు కాంగ్రెస్‌ లో చేరిపోయారు. చివరకు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, రేఖా నాయక్‌ వంటివారు సైతం కాంగ్రెస్‌ లోకి దూకేశారు.

బండి సంజయ్‌ ను రాష్ట్ర అధ్యక్ష పదవిని తప్పించిన బీజేపీ అధిష్టానం ఆ బాధ్యతలను కిషన్‌ రెడ్డికి అప్పగించింది. దీంతో బండి వర్గం అధిష్టానం నిర్ణయంపై కారాలు మిరియాలు నూరుతోంది. బండిని అధ్యక్షుడిగా తప్పించాక బీజేపీ బాగా బలహీనపడిందని చెబుతున్నారు. కిషన్‌ రెడ్డి అంత దూకుడైన నేత కారని.. ఎన్నికల లాంటి కీలక సమయంలో ఆయన లాంటి సౌమ్యుడైన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదని అంటన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీలో కీలక నేతలుగా ఉన్న మాజీ ఎంపీలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి ఆ పార్టీకి టాటా చెప్పడం ఖాయమేనంటున్నారు.

ఈ నలుగురు నేతలు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో నిర్వహించిన సభకు గైర్హాజరు కావడం ఇందుకు నిదర్శనమంటున్నారు. దేశ ప్రధాని హాజరైన సభకు వీరు రాలేదంటే ఈ నలుగురు నేతలు పార్టీ మారడానికి నిశ్చయించుకున్నారని చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకే కాకుండా తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తాజాగా నిర్వహించిన తెలంగాణ పదాదికారుల సమావేశానికి సైతం విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఏనుగు రవీంద్రరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు నేతలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని.. ఆ పార్టీలో చేరడం ఖాయమనేనని టాక్‌ నడుస్తోంది.

ఈ నలుగురే కాకుండా మరికొంతమంది నేతలు కూడా బీజేపీని వీడటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. బీజేపీని వీడే వారందరి చూపు కాంగ్రెస వైపే ఉందని అంటున్నారు.