రథయాత్రలు రెడీ ?.. బండి సంజయ్ దూరం
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోంది. ఇందులో
By: Tupaki Desk | 10 Sept 2023 2:30 PM ISTరాబోయే తెలంగాణా ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 26వ తేదీ నుంచి మూడు రూట్లలో మూడు యాత్రలను ఒకేసారి మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యింది. ఈనెల 26వ తేదీ నుండి 19 రోజుల పాటు ఏకబిగిన 4 వేల కిలోమీటర్లను కవర్ చేయాలని నేతలు డిసైడ్ అయ్యారు. ఈ యాత్రకు బీజేపీ నేతలు రథయాత్రలని పేరుపెట్టారు. ఈ యాత్రను మూడు జోన్లుగా వర్గీకరించి ముగ్గురు కీలక నేతల ఆధ్వర్యంలో రథయాత్రలు చేయడానికి రంగం రెడీ అవుతోంది.
బాసర, సోమశిల, భద్రాచలం ప్రాంతాల నుండి ఒకే కాలంలో మూడు రథాలు బయలుదేరాలని పార్టీ డిసైడ్ చేసింది. బాసర జోన్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు వస్తాయి. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సోమశిల జోన్లోకి వస్తాయి. ఖమ్మం, వరంగల్, కరీనంగర్ జిల్లాలు భద్రాచలం జోన్ పరిధిలోకి వస్తాయి. బాసర నుండి రాష్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సోమశిల జోన్ లో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భద్రాచలం నుండి హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ రథయాత్రకు నాయకత్వం వహించబోతున్నారు.
ఒకేరోజు అన్నీ రథయాత్రలు ప్రారంభం సాధ్యం కాకపోతే ఒక రోజు తేడాలో రథయాత్రలు ప్రారంభం అయ్యేట్లుగా నేతలు ప్లాన్ చేశారు. మూడు రథయాత్రలను అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ లో ముగించాలని పార్టీ డిసైడ్ చేసింది. హైదరాబాద్ కు మూడు రథయాత్రలు చేరుకునే సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ సభకు నరేద్రమోడీని ముఖ్యఅతిధిగా పిలవాలని ఆలోచిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామందిని సీనియర్లను రథయాత్రల్లో ఇన్వాల్వ్ చేస్తున్న పార్టీ కీలక నేతలు మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మాత్రం దూరంగా పెట్టేశారు. నిజానికి తెలంగాణాలో రథయాత్రలన్నా, పాదయాత్రలన్నా పార్టీలో ట్రెండ్ సెట్ చేసింది బండి సంజయే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే బండితో చాలామంది నేతలకు ముఖ్యంగా పై ముగ్గురు నేతలకు ఏమాత్రం పడదు. నేతల మధ్య ఉన్న ఇగో సమస్యే పార్టీకి బాగా నష్టంచేస్తోందని వీళ్ళు గ్రహించటంలేదు.
