Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ తుస్.. అందుకే కాంగ్రెస్ ఎస్

తెలంగాణ రాజకీయాల్లో గత మూడేళ్లలో బీజేపీ ఎత్తుపల్లాలను చూసిందనే చెప్పాలి

By:  Tupaki Desk   |   5 Jan 2024 11:30 PM GMT
తెలంగాణ బీజేపీ తుస్.. అందుకే కాంగ్రెస్ ఎస్
X

తెలంగాణ రాజకీయాల్లో గత మూడేళ్లలో బీజేపీ ఎత్తుపల్లాలను చూసిందనే చెప్పాలి. 2020 వేసవిలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనం వరకు తెలంగాణ బీజేపీ దూకుడు చూపింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా డివిజన్ల కైవసంతో మాంచి ఊపులో కనిపించింది. కానీ, మునుగోడుతో అంతా చెడగొట్టుకుంది. ఆపై ఎన్నికలకు కేవలం నాలుగైదు నెలల ముంగిట రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి భంగపడింది.

ఆ సీట్లు అభ్యర్థులవి.. పార్టీవి కాదు

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏకంగా 8 సీట్లు గెలుచుకుంది. అయితే, కామారెడ్డి సహా పలుచోట్ల అభ్యర్థులను చూసి ప్రజలు గెలిపించారు. మరికొన్నిచోట్ల స్థానిక పరిస్థితులను బట్టి పార్టీని ఆదరించారు. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ సంజయ్ ను గనుక పార్టీ రాష్ట్ర బాధ్యతల్లో కొనసాగించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో? కానీ, బీఆర్ఎస్ కు మేలు చేయబోయి తన కంటిని తానే పొడుచుకుని కాంగ్రెస్ కు కుర్చీ అప్పగించింది.

అందుకే సోనియా ఇక్కడి నుంచి పోటీ?

మొన్నటివరకు దూకుడుగా కనిపించినా.. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు కేవలం సాధారణ పార్టీ. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ పెద్దలు రాష్ట్రం నుంచి భారీగా సీట్లు ఆశిస్తున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే.. అధికార పార్టీని ఢీ అంటే ఢీ అంటూ రెండోస్థానంలో ఉన్న బీజేపీని చేజేతులా మూడో స్థానానికి పడేసి.. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు అధికారం అప్పగించింది కాబట్టి. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలను తట్టుకుని అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ వాటికి చాన్సివద్దు. కాగా, ఏపీలో బీజేపీకి బలమే లేదు. కర్ణాటకలో మాత్రం బలీయమైన పార్టీనే. తెలంగాణలో వీక్ అయిపోయింది. అందుకనే కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని ఇక్కడినుంచి పోటీ చేసేలా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.