Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 6:25 AM GMT
బాబు అరెస్ట్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ బీఆరెస్స్ నేతలు ఎవరూ పెద్దగా స్పందించినట్లు కనిపించింది లేదు! ఎల్బీ నగర్ బీఆరెస్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం బాబు అరెస్ట్ పై కాస్త స్పందించారు. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు! ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణలోని బీజేపీ నేతలు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకొంతమంది స్పందిస్తూ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే... అధికార బీఆరెస్స్ నుంచి ఎలాంటి భారీ రియాక్షన్ రాలేదు. అయితే బాబు అరెస్ట్ అయిన 15 నిమిషాలలోపు కేటీఆర్ చేసిన ట్వీట్ మాత్రం కాస్త వైరల్ అయ్యింది. అంతకు మించి అధికారికంగా చెప్పుకోదగ్గ స్పందన రాలేదు అనే అనుకోవాలి.

ఈ సమయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలిసో తెలియకో తప్పులు జరుగుతాయి.. కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష గొప్పదని చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలంలో పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"రాజకీయంగా కక్షలు పనిచేయవు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఆయన తెలుగుదేశం కావొచ్చు, ఆయనను జైల్లో పెట్టడం అంత మంచి పద్దతి కాదు. ఆయన 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు.. తెలంగాణ, ఏపీలో పనిచేశారు. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతలివాళ్లను మనం జైలుకి పంపిద్దాం, వాళ్లని శిక్షిద్దాం అనే భావన మంచిది కాదు" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో "ఇది పద్దతి కూడా కాదు" అని తెలిపిన ఆయన... తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... "దేశంలో ఇటువంటివి జరగకూడదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిదికాదు" అని అన్నారు. తనవద్దకు కూడా వచ్చి కొంతమంది బీజేపీ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు తిట్టారని చెబుతుంటారని... తిడితే వాళ్ల నోరే కరాబు అవుతాదని, తనకేమీ పోదని చెప్పినట్లు పోచారం చెప్పుకొచ్చారు. ఇక, తాను తప్పు చేస్తే కదా బయపడేది అని అన్నారు.

అందువల్లే తాను ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయనని, ఎవరూ కూడా చేయకూడదని అన్నారు. ఇదే క్రమంలో భగవద్గీతలో చెప్పినట్లు అని మొదలుపెట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డి... కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిదని, మనిషికి క్షమించే గుణం రావాలని, అది చాలా పెద్ద గుణమని అన్నారు. కక్ష అంటే.. పోలీసులను పిలిస్తే పట్టుకుని వెళ్లి లోపల వేస్తారు అని చెప్పిన ఆయన... అది మంచిదా అని ప్రశ్నించారు.

"తెలిసో తెలియకో తప్పులు జరుగుతాయి.. వాటికి క్షమించాలి, మన్నించాలి.. ఆ తప్పులు మరోసారి చేయకుండా బెదిరించాలి.." అని చెబుతూ చంద్రబాబు అరెస్టును మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి! దీంతో... ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.