Begin typing your search above and press return to search.

బడ్జెట్ సెషన్ ఈ రోజుతో సమాస్తం.. ఎవరికెన్ని మార్కులు

ఈ రోజుతో (శుక్రవారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:21 AM GMT
బడ్జెట్ సెషన్ ఈ రోజుతో సమాస్తం.. ఎవరికెన్ని మార్కులు
X

ఈ రోజుతో (శుక్రవారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత జరిగిన మొదటి బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. వాద ప్రతివాదనలతో పాటు.. అధికార విపక్షాల మధ్య ఘాటు వ్యాఖ్యలతో సభ ఆసక్తికరంగా సాగటం తెలిసిందే. బడ్జెట్ సెషన్ లో అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ హైలెట్ కాగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ హైలెట్ అయ్యారు. మిగిలిన మంత్రులు ఓమాదిరి మాత్రమే తమ సత్తా చాటారు. అధికార పక్షం నుంచి అన్నీ తానై వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు సాయంగా ఉత్తమ్.. భట్టి.. నిలిచినా.. విపక్షాలపై విరుచుకుపడే విషయంలో మాత్రం రేవంత్ తన సత్తా చాటారు.

విపక్షం విషయానికి వస్తే.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేదు. ఈ మధ్యనే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. సభకు వచ్చేందుకు మాత్రం ఆసక్తిని చూపలేదు. ప్రభుత్వాధినేతగా రేవంత్ పలుమార్లు కేసీఆర్ ను సభకు రావాలని ఆహ్వానించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. చివరకు కేసీఆర్ సభకు రాకపోవటం మరో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు నెగిటివ్ గా మారిన పరిస్థితి.

అసెంబ్లీ సమావేశాల్లో సభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయటం.. సూచనలు చేయటం.. వారు చేసే విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వటం లాంటివి చేయాల్సిన కేసీఆర్.. అందుకు భిన్నంగా అసెంబ్లీకి దూరంగా ఉంటాన్ని వేలెత్తి చూపుతున్నారు. అసెంబ్లీకి రాని ఆయన.. నల్గొండ సభకు ఎలా వెళతారు? అని ప్రశ్నిస్తున్నారు. సభ పెట్టుకొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సరిపోదని.. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

సభకు రాకుండా ఉండటం ద్వారా కేసీఆర్ ఈ సెషన్ లో జీరో అయ్యారని చెప్పాలి. ఆయనే కాదు.. ఆయన కుమారుడు కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సైతం తన సత్తాను చాటలేకపోయారు. బీఆర్ఎస్ మొత్తంలో అన్నీ తానై పార్టీని సభలో నడిపించిన క్రెడిట్ హరీశ్ రావుకే దక్కుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి.. ఇతర సభ్యులు వాడిన భాష విషయంలోనూ రేవంత్ సంయమనం పాటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తమను అదే పనిగా టార్గెట్ చేసిన సందర్భంలో గులాబీ నేతలపై విరుచుకుపడిన సీఎం రేవంత్ ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. తొందరపాటు వ్యాఖ్యలతో విమర్శలు పాలు కాకుండా సంయమనంతో వ్యవహరించారని చెప్పాలి. అవసరమైన సందర్భంలో కాస్తంత ముతక భాషను మాట్లాడినప్పటికీ.. సెషన్ మొత్తం అదే తీరును ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపించింది.

వివిధ అంశాలపై జరిగే చర్చ వేళలో సీఎం రేవంత్ భాషలో పరిణితి కనిపించింది. విపక్షాలు విరుచుకుపడుతున్నా.. సంచలనం కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ధోరణిని ప్రదర్శించలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మాట్లాడే మాటల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం కనిపించింది. అధికారం చేతిలో ఉన్న వేళలో.. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్న ఈ రోజుల్లో సంయమనం మిస్ కాకపోవటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. దూకుడు ఉండాల్సిందే కానీ.. దానికో అర్థం పరమార్థం ఉండటం అవసరమన్న విషయాన్ని సీఎం రేవంత్ గుర్తించి మసులుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా అసెంబ్లీ సెషన్ లో హీరోగా రేవంత్ నిలిస్తే.. కేటీఆర్ జీరోగా పలువురు అభివర్ణిస్తున్నారు.