Begin typing your search above and press return to search.

దీన్ని నమ్మేద్దాం అంటారా...?

ఎందుచేతనంటే ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయాక తెలంగాణా చిన్న స్టేట్ గా ఉంది. జస్ట్ 119 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్నాయి

By:  Tupaki Desk   |   1 Dec 2023 2:22 PM GMT
దీన్ని నమ్మేద్దాం అంటారా...?
X

తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ వస్తుంది అని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు నివేదికలు ఇచ్చిన నేపధ్యంలో ఆ దిశగానూ రాజకీయంగా వాడిగా వేడిగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ వర్గాలలో దీని మీద ఆసక్తికరమైన చర్చ అయితే ఉంది.

ఎందుచేతనంటే ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయాక తెలంగాణా చిన్న స్టేట్ గా ఉంది. జస్ట్ 119 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో సింపుల్ మెజారిటీ రావాలీ అంటే అరవై సీట్లు దక్కాలి. మరి అరవై సీట్లు ఎవరికి వస్తాయి అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అటు బీయారెస్ తగ్గడంలేదు, ఇటు కాంగ్రెస్ కూడా భారీగా పుంజుకుంది.

ఈ నేపధ్యంలో హోరా హోరీగా పోరు సాగింది. అదే టైం లో 29 సీట్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లాంటి చోట్ల పోలింగ్ 46 శాతం దాటలేదు. వీటిని దృష్టిలో ఉంచుకున్న వారంతా హంగ్ అసెంబ్లీ రావచ్చు అని అంటున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో విభజన తెలంగాణాలో జరిగిన రెండు ఎన్నికల్లో సైతం హంగ్ అన్న మాటే లేకుండా ప్రజలు స్పష్టమైన తీర్పుని అయితే ఇచ్చారు.

దీంతో ఈసారి కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా తీర్పు ఇస్తారు అని అంటున్నారు. అయితే హంగ్ వస్తే ఏమి జరుగుతుంది, ఏమి జరగవచ్చు అన్న దాని మీద ఎడ తెగని చర్చలు అయితే సాగుతూనే ఉన్నాయి. బీజేపీ బీయారెస్ కి మద్దతు ఇవ్వవచ్చు అన్న వారూ ఉన్నారు. మజ్లీస్ మద్దతు కూడా బీయారెస్ కి ఉండొచ్చు అని అంటున్న వారూ ఉన్నారు.

ఇందులో మజ్లీస్ సపోర్ట్ విషయంలో ఆలోచనలు ఎవరికీ పెద్దగా లేకపోయిన బీజేపీ మద్దతు ఇస్తుందా అన్నది మాత్రం ఇంటరెస్టింగ్ టాపిక్ గానే ఉంది. దాంతో బీజేపీ ఇపుడు కింగ్ మేకర్ అవుతుందా అనేది ఒక చర్చ. ఇక ఇదే అదనుగా బీజేపీ నేతలు సైతం తమ మాటలతో పదునెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా చూస్తే పోలింగ్ జరిగిన తీరు మీద ఇప్పటికే ఒక సీరియస్ రివ్యూ చేసిన బీజేపీ నేతలు కచ్చితంగా హంగ్ రావచ్చు అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

అదే టైంలో హంగ్ కనుక వస్తే బీయారెస్ కి మద్దతు ఇవ్వకూడదు అని డిసైడ్ అయినట్లు కూడా భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 119 సీట్లలో బీజేపీ సుమారుగా ముప్పయి దాకా సీట్లలో తన బలాన్ని చాటుకుందని అంటున్నారు. అందులో కచ్చితంగా గెలిచే సీట్లు 15 నుంచి 20 దాకా ఉండవచ్చు అని కూడా లెక్కలేసుకుంటోంది.

మరి బీజేపీకే 20 సీట్ల దాకా వస్తే మాత్రం హంగ్ అన్నది పక్కా అని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే కమలం తన చక్రాన్ని తిప్పాలనీ అనుకుంటోందిట. హంగ్ వస్తే ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది అని అంటున్నారు.

ఇక మొదటి నుంచి బీజేపీ నేతలు హంగ్ అంటూనే మాట్లాడుతున్నారు అని అంటున్నారు హంగ్ కనుక వస్తే తమ పార్టీకే అడ్వాంటేజ్ ఉండేలా చేసుకోవాలని చూస్తున్నారుట. బీయారెస్ లో ఏక్ నాధ్ షిండేలను గమనించి తమ వైపు తిప్పుకుని తద్వారా మహారాష్ట్ర తరహాలో రిమోట్ తమ చేతిలో ఉంచుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారుట. అలా కనుక జరిగేంత వరకు రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా చూస్తున్నారుట.

ఇక ఆ విధంగా చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు లాభిస్తుంది అని కూడా అంచనా కడుతున్నారుట. అయితే ఇవన్నీ నమ్మేసేందుకు అంత ఈజీగా లేవని అంతా అంటున్నారు. ఏ సర్వే కూడా బీజేపీకి సింగిల్ డిజిట్ నంబర్ ఇవ్వలేదని అది కూడా నాలుగైదు సీట్లకే పరిమితం చేసిందని అంటున్నారు. బీజేపీ ఓట్ల శాతం పెరగవచ్చేమో కానీ సీట్లు దక్కవని అంటున్నారు.

ఇక బీయారెస్ ని అధికారంలోకి రాకుండా చేయడం కానీ అలాగే కాంగ్రెస్ ని రాకుండా చేయడం కానీ బీజేపీ వల్ల కాదని అంటున్నారు. అదెలా అంటే యాభై కి పైగా సీట్లు బీయారెస్ తెచ్చుకుంటే ఆరేడు సీట్లతో మజ్లీస్ పార్టీ బీయారెస్ కొమ్ము కాస్తుంది ఆ విధంగా చాలా సులువుగానే ఆ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అలాగే కాంగ్రెస్ కి సీట్లు తక్కువ పడినా మజ్లీస్ ఏమైనా మనసు మార్చుకుంటే అపుడు కూడా సర్కార్ ఏర్పడుతుంది.

ఆ విధంగా ఆలోచిస్తే బీజేపీ కంటే మజ్లీస్ నే ఇక్కడ కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు. అదే విధంగా బీయారెస్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదని తమకు సీట్లు తగ్గితే వేరే మార్గాల ద్వారా ఆ పార్టీ ప్రయత్నాలు చేసుకుంటుందేమో కానీ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తానికి చూస్తే బీజేపీకి పగటి కలలు మాత్రమే అంటున్నారు.

ఇలాగే మేము అధికారంలోకి వచ్చేస్తామని ఊదరకొట్టి తీరా ఎన్నికలు వచ్చేసరికి కమలనాధులు తెలంగాణాలో చతికిలపడిన ఉదంతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇపుడు హంగ్ ఆశలు కూడా అలాంటివే అని కొట్టిపారేస్తున్నారు.