Begin typing your search above and press return to search.

కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ!

ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు

By:  Tupaki Desk   |   26 Oct 2023 12:03 PM GMT
కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ!
X

త్వరలో జరగబోతున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండిట్లో ఏదో ఒక చోట కేసీఆర్ విజయం సాధిస్తారని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈసారి కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడక కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధమని బిజెపి నేత ఈటల రాజేందర్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఈటల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న ఈటల...ఉద్యమ నాయకుడిగా కూడా పాపులర్ అయిన నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ కు గట్టి పోటీనిస్తారని బిజెపి అధిష్టానం భావిస్తుందట. మరోవైపు, కామారెడ్డిలో రేవంత్ ను బరిలోకి దించడం ద్వారా కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. టిపిసిసి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్ విసురుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఈ నిర్ణయం దిశగా ఆలోచనలు చేస్తుందని తెలుస్తోంది.

కామారెడ్డి లో తొలిసారిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కేసీఆర్ కు రేవంత్ రూపంలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తరఫున కామారెడ్డి బరిలో దిగేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా రెడీ అవుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు కామారెడ్డి సీట్ కేటాయిస్తే షబ్బీర్ అలీకి వేరే స్థానం కేటాయించడం లేదంటే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నచ్చచెప్పడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి గజ్వేల్ లో కేసీఆర్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ మాస్ లీడర్లుగా పేరు ఉన్న రేవంత్ రెడ్డి, ఈటలలు ఆయనకు ప్రత్యర్థులుగా దిగితే మాత్రం కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.